- అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ
వేద న్యూస్, హుజురాబాద్:
‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు.
సర్కార్ వద్ద పైసల్లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారని గుర్తుచేశారు. అట్లాంటప్పుడు ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో హామీలను అమలు చేయడానికి మీ దగ్గరున్న ప్రణాళిక ఏమిటో అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, ప్రజలకిచ్చిన హమీలపై కాంగ్రెస్, గత ప్రభుత్వ తప్పిదాలపై బీఆర్ఎస్ నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకే అసెంబ్లీ వేదికగా ఒకరికొకరు తిట్టుకునే కార్యక్రమానికి తెరదీశారన్నారు.
గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికగా రూ.500ల కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంట్ ఛార్జీల మాఫీ హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడోస్థానమేనని బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు అర్థమై ఎన్నికల నుండి ఏ విధంగా తప్పించుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారన్నారు. బండి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు కరుణాకర్ తదితరులున్నారు.