- టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్
వేద న్యూస్, ఓరుగల్లు:
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హన్మకొండ జిల్లాలో 85 వేల మంది అన్నదాతలుండగా, సగం మందికి మాత్రమే ‘మాఫీ’ అయిందని, మిగతా రైతులకు కాలేదని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు కాంగ్రెస్ సర్కారు ‘రైతు పండుగ’ అంటూ విజయోత్సవాలు చేస్తున్నద? అని నిలదీశారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు ఉత్సవాలు చేస్తున్నారా? పశ్నించారు.
రాష్ట్ర సర్కారు తొలుత రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి.. రూ.17 వేల కోట్ల ‘మాఫీ’ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అని అంటున్నదని మండిపడ్డారు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల ‘రైతుభరోసా’ ఎగ్గొట్టారని చెప్పారు. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారన్నారు. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దలు చెప్పారని, ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యంలో రైతు బతుకుకు ‘భరోసా’ ప్రభుత్వం నుంచి లభించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో పెట్టుబడి సాయం అందకర రైతులు ప్రైవేటుగా అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి పంటలు పండించి ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎన్నికలకు వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటుండటం మోసమని విమర్శించారు. దోడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని ప్రశ్నించారు.