• హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు టీఆర్ఆర్ఎస్ లీడర్ల వినతి

వేద న్యూస్, వరంగల్:

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయడంతో పాటు రైతు భరోసా రూ.15 వేలు అందజేసి అన్నదాతకు అండగా నిలవాలని టీఆర్ఆర్ఎస్(తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు కోరారు.

సోమవారం ఈ మేరకు వారు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. ఆ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్‌రావు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడారు.

రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, రైతుల కష్టాన్ని ప్రభుత్వం ఆలోచించి తక్షణమే రుణమాఫీ చేసి, రైతు భరోసా అందజేయాలని కోరారు.

వానాకాలం పూర్తయి యాసంగి సీజన్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో సర్కారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, రైతుకు అండగా నిలవాలని అభ్యర్థించారు.

తమది ప్రజా ప్రభుత్వం, రైతు సర్కారు అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నిజంగా ఆచరణలో రైతుల సంక్షేమానికి కట్టుబడి, వారి మేలు కోసం పని చేయాలని కోరారు.