• ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
  • కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు నేతలు

వేద న్యూస్, హన్మకొండ: 
హన్మకొండ జిల్లాలో ఇటీవల సీనియర్ జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,వల్లాల జగన్,బండి విజయ్ కుమార్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడుతాడి బాపురావు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు టీవీ రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ తదితరులు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు బనాయించిన తప్పుడు కేసు వివరాలను వారు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ,రాజేందర్ గతంలో దాదాపు పదేండ్లు వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేశారని, ప్రస్తుతం సొంత పత్రికను
నడుపుతున్నారని,ఐనవోలు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై రాజేందర్ పత్రికలో వరుస కథనాలు ప్రచురించారని తెలిపారు.

దీనిని మనసులో పెట్టుకున్న ఐనవోలు తహశీల్దార్ రాజేందర్ పై కుట్రపన్ని పథకం ప్రకారం ఓ యూట్యూబర్ సహాయంతో పోలీసులతో కుమ్ముక్కై కావాలని తప్పుడు కేసు నమోదు చేయించి జైలుకు పంపించారని ఆరోపించారు. నీతి, నిజాయితీతో వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సరైంది కాదని అన్నారు.

కావాలని ఒకరిద్దరు రాజేందర్ పై సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్ ను వదిలేసి ఏ తప్పు చేయని జర్నలిస్టు రాజేందర్ పై పోలీసులు అక్రమంగా కేసు బనాయించి వేధిస్తున్నారని అన్నారు.

ఈ కుట్రపూరిత అక్రమ కేసు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టు రాజేందర్ పై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన భూములు, ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్ లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు బాధ్యులైన ఐనవోలు తహశీల్దార్, ఎస్ ఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టు దామెర రాజేందర్ పై అక్రమ కేసు తొలగించక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుందని మామిడి సోమయ్య హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొలమాని గోపాల్, పాలడుగుల సురేందర్, సభ్యులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.