- ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్షలకు కాంగ్రెస్ ఓబీసీ నేత సంఘీభావం
వేద న్యూస్, పార్వతీపురం:
రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా…? లేనట్లా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు ప్రశ్నించారు. శనివారం పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వారణాసి శ్రీహరి, చుక్క చంద్రరావు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న నిరవధిక దీక్షలకు సంఘీభావాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫలితాలు ప్రకటించి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు లేకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం డిగ్రీ విద్యను మరిచిపోయిందేమోనని ఎద్దేవా చేశారు.
అలాగే విద్యార్థులకు ఇబ్బంది కలిగించే సెమిస్టర్ విధానం, మేజర్, మైనర్ విధానాన్ని అమలు చేయటం బాధాకరమన్నారు. జిల్లాలో పీజీ కోర్సుల లేక విద్యార్థులు విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు డిగ్రీ తర్వాత తమ భవిష్యత్తు చదువుకు స్వస్తి చెప్పే పరిస్థితి అధికంగా ఉందన్నారు. జిల్లా ఏర్పడ్డాకైనా పీజీ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.
పెండింగ్ లో ఉన్న సుమారు 6,400 కోట్ల బకాయి ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆఫ్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలన్నారు. సింగిల్ సబ్జెక్టు స్థానంలో డ్యూయల్ మేజర్ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టాలన్నారు.
పార్వతీపురం పాలకొండ గుమ్మలక్ష్మీపురం కేంద్రాల్లో పిజి సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న భవనాల వసతి, మెనూ, వైద్య సదుపాయాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారమయ్యేంతవరకు విద్యార్థులకు, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.