- 44 మంది రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక
- పండుగల సమయంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచన
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 9న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘‘ఏ.జే.’ రౌడీషీటర్లకు స్వేచ్ఛ..!?’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి పోలీసులు స్పందించారు.
గణేశ్ నిమర్జనం వేళ రౌడీ షీటర్లను బైండోవర్ చేయకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని, రాబోయే బతుకమ్మ, దసరా పండులకు కూడా ఇలానే స్వేచ్ఛ ఇస్తే ఇక హత్యలు జరిగే ప్రమాదముందని కథనంలో ‘వేద న్యూస్’ హెచ్చరించింది. నిత్యం యాక్టివ్‌గా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, నిఘా పెంచి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయాన్ని ప్రచురించింది. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు స్పందించారు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 44 మంది రౌడీ షీటర్స్ ని పోలీస్ స్టేషన్‌కు శనివారం పిలిపించారు. ముందస్తు నేర నివారణ ప్రక్రియలో భాగంగా రానున్న సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడానికి.. రౌడీషీటర్స్ అందరినీ ఎటువంటి గొడవలలో తలదూర్చే వద్దని సూచించారు.
ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరిగే విధంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరించారు. అనంతరం ఆ 44 మంది రౌడీషీటర్స్‌ను మంచి ప్రవర్తన నిమిత్తం ఖిలా వరంగల్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఏఎస్పీ, ఐపీఎస్ అధికారి శుభం నగరాలే, మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.