మంజీరా తీరంలో అధికారుల మెరుపు దాడులు
50 ట్రాక్టర్ల అక్రమ ఇసుక సీజ్
నాలుగు డంపులు సీజ్ చేసిన అధికారులు
పాపన్నపేటలో రెవెన్యూ, పోలీసుల సంయుక్త దాడులు.. భారీగా ఇసుక పట్టివేత
వేద న్యూస్, పాపన్నపేట
పాపన్నపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపులను రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సీజ్ చేశారు. శనివారం సాయంత్రం మంజీరా నది పరీవాహక ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు 45 నుండి 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆరేపల్లి గ్రామ పరిధిలోని మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కొందరు అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ ఉంచారన్న పక్కా సమాచారం అధికారులకు అందింది. దీంతో పాపన్నపేట తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆరేపల్లి గ్రామ పాలన అధికారి (GPO), మండల గిర్దావర్ మరియు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో గ్రామ పరిధిలోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 45 నుండి 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాపన్నపేట తహసీల్దార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
