= రూ.150 కోట్ల నిధులతో రాజన్న ఆలయ విస్తరణ 

= చరిత్రలో నిలిచిపోయేలా మేడారం పనులు

= 18న సీఎం, మంత్రులతో అక్కడే కేబినెట్ మీటింగ్

= మంత్రి సీతక్క 

= భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

= పాల్గొన్న ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేద న్యూస్, వేములవాడ:

అత్యంత భక్తుల రద్దీ ఉండే ఆలయాల అభివృద్ధి, విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రూ.150 కోట్ల నిధులతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్ బి. గీతే పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ముందుగా కోడె మొక్కు చెల్లించుకున్న మంత్రి, భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాయత్రి మాతను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం, వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన వసతులు, సులభ దర్శనం త్వరలో అందుబాటులోకి రానున్నాయని, వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అంశాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో, సీఎం స్వయంగా హాజరై పనులకు ప్రారంభం చేశారని గుర్తు చేశారు. అలాగే మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఆదివాసీ పూజారులు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల పునర్నిర్మాణం చేపట్టామని, రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి రానున్న తరాలకు చరిత్రగా నిలిచేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మేడారం రానుండగా, అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న మేడారం జాతర పనులను సీఎం, మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు. మేడారం జాతరకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చినట్లు మంత్రి వివరించారు. మేడారం జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు స్వాగతం పలికామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రూ.150 కోట్ల నిధులతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భక్తులకు వేగవంతమైన దర్శనం, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని చెప్పారు. మేడారంలోనూ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి, వేములవాడ ఆర్డీఓ రాధాభాయి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.