•  స్తంభించిన వస్త్రోత్పత్తి

వేద న్యూస్, గంగాధర:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని పవర్ లూమ్స్‌పై బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడి అనిత ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన చేనేత జౌళి శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు.

పాత జీవోలను ఆధారంగా తీసుకుని గ్రామంలోని పలు సాంచలపై నడుస్తున్న కలర్‌ చీరలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మిట్టపెల్లి వెంకటేశ్, దూస వెంకటేశం అనే నేతకార్మికులపై కేసులు నమోదు చేసి సాంచల్లో నడుస్తున్న చీరలను కోసేశారు. అధికారులు వీధివీధి తిరుగుతూ సాంచలను పరిశీలించడంతో నేతకార్మికులు భయాందోళనకు గురయ్యారు.

ఉపాధి కోల్పోతున్న నేతకార్మికులు

రెక్కాడితేనే డొక్కానన్న పరిస్థితిలో ఉన్న నేతకార్మికులకు ప్రభుత్వం ఇటీవల స్వశక్తి మహిళా సంఘం చీరల ఆర్డర్లు ఇవ్వడంతో కొంత ఉపాధి లభించింది. అయితే, అదే సమయంలో విజిలెన్స్ దాడులు జరగడంతో పవర్ లూమ్స్ పనులు నిలిచిపోయాయి.

ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు
“పనులు లేక ఇబ్బంది పడుతున్న మా కుటుంబాలపై కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నారు” అని నేతకార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వశక్తి చీరల పనులు మొదలైనప్పటికీ, కలర్‌ చీరలు, తయారు చేయడం నేరంగా పరిగణించి అధికారులు దాడులు చేయడం అన్యాయమని ఆరోపించారు.

ప్రతి ఏడాది భయం
ప్రతి యేటా చెన్నై చేనేత జౌళి శాఖ విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేయడం వల్ల భయాందోళన నెలకొంటోందని వ్యాపారులు, కార్మికులు అన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ముగిసిన తర్వాత ఏడాదిన్నర పాటు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ఇప్పుడు లభిస్తున్న స్వశక్తి చీరల ఆర్డర్లను కూడా నిలిపేస్తే తమ జీవనం సంకటంలో పడుతుందని నేతకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.