• సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా

వేద న్యూస్, జమ్మికుంట:
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని వివిధ గ్రామాల నుండి కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లాపరిపాలన అధికారి సుధాకర్ రావు కు ధర్నా అనంతరం వినతిపత్రం సమర్పించారు.

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వివిధ గ్రామపంచాయతీలలో రెండు నెలల నుండి 10 నెలల వరకు ఒక్కో గ్రామపంచాయతీలో వేతనాలు బకాయి ఉన్నాయని చెప్పారు. కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడం దుర్భరంగా మారిందని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులు అరికట్టాలని, జీవో నెంబర్ 51 ప్రకారం రూ.9,500 వేతనం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని గ్రామపంచాయతీలలో కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు ఇవ్వవలసిన కనీస భద్రత పరికరాలు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, రెండు జతల బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె, తదితర పరికరాలు ఇవ్వాలని జీవోలు వచ్చినప్పటికీ..వాటిని అమలు చేయడంలో మండల స్థాయి అధికారులు వైఫల్యం చెందారని పేర్కొన్నారు.

ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పీఎఫ్ ఈఎస్ఐ, సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షులు కాశిపాక శంకర్, జిల్లా కోశాధికారి ఎండీగా రవీందర్రావు, కమిటీ సభ్యులు కండే సదయ్య, వడ్లూరి లక్ష్మీనారాయణ మహంకాళి కొమురయ్య, సారయ్య , మధు నక్క, శనిగర కొమురయ్య, కార్మికులు పాల్గొన్నారు‌.