- “భళా..” రక్షక భటులకు సలాం అంటూ పలువురి ప్రశంస
వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కాగా, శివుడిని మించిన ప్రతిభ పాఠవాలు నేర్పరితనంతో.. ఓ కేసులో ఇంటి దొంగను ఖాకీలు పట్టుకున్నారు. వివరాల్లోకెళితే..
ప్రియురాలి మైకంలో సొంత ఇంటికి కన్నం వేసి కన్నతల్లి బంగారం మాయం చేసిన యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్ నగరంలో అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొంగిలించిన బంగారమంతా రికవరీ చేసి, ఆ విద్యార్థిని జైలుకి పంపారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం(జూన్ 09) తెల్లవారుజామున ఖిలా వరంగల్‌లోని రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో భద్రపరచిన 16 తులాల బంగారం అపహరణకు గురైంది. దీంతో సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రాథమికంగా అక్కడ సీన్ చూస్తే దొంగతనాల్లో ఆరితేరిన దొంగ ఈ దోపిడీకి పాల్పడినట్లు సీన్ కనిపిస్తుంది. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పోలీసులు.
ఇంట్లోని బంగారమంతా లూటీ అవడంతో లబోదిబోమని మొత్తుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొడుకు జయంత్ బంగారం చోరీపై పోలీసులకు పిట్టకథలు వినిపించారు. అక్కడ తెగ హడావిడి చేశారు. అయ్యో మా బంగారం అంతా పోయిందని కుటుంబం అంతా నెత్తి నోరు బాదుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే ఇంటి దొంగ బయటపడ్డాడు.
కేసు పెట్టిన ఓనర్ రామకృష్ణ కొడుకే అసలు దొంగని తేల్చారు. హనుమకొండలోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జయంత్ విద్యార్థి, అదే కళాశాలల్లో చదువుతున్న ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతిని ఆకట్టుకోవడం కోసం జల్సా ఖర్చులకు డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు. సదరు యువకుడు ఇంట్లో బంగారంపై కన్నేశాడు. అతని కన్నతల్లి దాచుకున్న బంగారం అంతా ఊడ్చుకుపోయి, అచ్చం సినిమా ఫక్కీలో హైడ్రామా క్రియేట్ చేశాడు. ఎవరో దొంగలు ఇంట్లో పడి బంగారమంతా ఊడ్చుకుపోయినట్లుగా కథ అల్లాడు.
ఎంతటి తెలివి గల నేరస్తులైనా పోలీసుల నిఘానేత్రాల నుండి తప్పించుకోలేరన్నట్లు టెక్నాలజీ అతన్ని పట్టించింది. దొంగతనం జరిగిన సమయంలో అతని సెల్ నెట్‌వర్క్ ఆధారంగా పోలీసులు అనుమానం వచ్చి విచారించగా అసలు కథ బయటపడింది. ఇంటి దొంగ బంగారం దొంగిలించినట్లు గుర్తించిన పోలీసులు జయంత్ ను అరెస్టు చేసి, అతని వద్ద 16 తులాల బంగారం రికవరీ చేశారు. తల్లిదండ్రులతోపాటు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, చోరీ కేసు నమోదు చేసి జైలుకి పంపారు. కన్న కొడుకే ఇంట్లో బంగారం దొంగిలించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. కొడుకు జైలుపాలు కావడంతో ఏం చేయాలో అర్థం కాని దయనీయ స్థితిలో తల్లిదండ్రులు కుమిలిపోయారు.

కాగా దొంగతనం కేసుని ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన మిల్స్ కాలనీ సీఐ బి. రమేశ్, ఎస్సెలు శ్రీకాంత్, సురేశ్, సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డు రఫీ, సిబ్బందిని వరంగల్ ఏసీపీ నందిరాం ఈ సందర్భంగాఅభినందించారు.