- స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటలేనా?
- పరిసరాలపై కనీస పట్టింపు ఎవరికీ లేదా?
- పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఇదీ దుస్థితి..
వేద న్యూస్, వరంగల్:
స్వచ్ఛ వరంగల్ అంటూ ప్రభుత్వాలు చేసే ప్రకటన ఉట్టి మాటేనా? అని గ్రేటర్ వరంగల్ వాసులు ఆవేదన వ్యక్తం చేసేలా పరిస్థితులు ఏర్పడ్డాయనీ చెప్పొచ్చు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంతే జార్ గంజ్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ప్రధాన కూడలి వద్ద చెత్త ఇబ్బడి ముబ్బడిగా పడి ఉండటం చూస్తే.. “స్వచ్ఛ వరంగల్” , “స్మార్ట్ సిటీ” అంటే ఇలాగేనా? ఉండేది అనే ఆందోళన చెందాల్సిందే. ఇష్టమొచ్చినట్టుగా చెత్తను పడేసి ఉన్న దృశ్యాలు “వేద న్యూస్ ” తెలుగు దినపత్రిక కెమెరాకు చిక్కాయి.
జి డబ్ల్యూ ఎం సి వారు ఏర్పాటు చేసిన చెత్త సేకరణ బాక్సులలో కాకుండా బయట రోడ్డు మీదే చెత్తాచెదారాన్ని ఇష్టమొచ్చినట్టుగా… నిర్లక్ష్య వైఖరితో పడేస్తున్నారు. సదరు ప్రాంతానికి అతి సమీపంలోనే ట్రాఫిక్ కంట్రోలింగ్ పాయింట్ కూడా ఉండటం గమనార్హం.

గత కొద్ది రోజులుగా సదరు ప్రాంతంలో చెత్త పేరుకుపోతున్నప్పటికీ పట్టించుకోవడం అనేది మరిచినట్టుగా కనబడుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం నేపథ్యంలో సీజనల్ డిసీజెస్ ముప్పు పొంచి ఉన్నది. ఈ సందర్భంలో నిర్లక్ష్య వైఖరితో చెత్తను ఇష్టమొచ్చినట్టుగా రోడ్డుమీద పడేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెంటనే సంబంధిత శాఖ వారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

