- తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ హెచ్చరిక
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పొగాకుకు కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించని యెడల రైతుల పక్షాన రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు 100 ఎకరాల్లో గత 20 సంవత్సరాలుగా పొగాకు పంటను సాగు చేస్తున్నారని చెప్పారు.
పండిన పంటను వీఎస్టి టీ లిమిటెడ్ కంపెనీకి మద్దతు ధరకు విక్రయించగా, ఈ ఏడాది గతంలో చెల్లించిన ధరకు భిన్నంగా ప్రాంతానికో ధర చెల్లిస్తున్నారని వెల్లడించారు. చింతలపల్లికి చెందిన రైతులు సుమారు 800 క్వింటాళ్ల పొగాకును వీఎస్టి కంపెనీకి విక్రయించగా, కిలో పొగాకుకు రూ.60 నుంచి రూ.80 వరకు మాత్రమే ధర నిర్ణయించా రని తెలిపారు.
ఇదే నాణ్యతతో ఉన్న పొగాకుకు రఘునాథపల్లిలో కిలోకు రూ.100 నుంచి రూ.120 వరకు చెల్లించారని ఆరోపించారు. సదరు కంపెనీ కాంట్రాక్టర్ వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరారు. అన్నదాతను మోసగించిన సదరు కంపెనీ యాజమాన్యంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.