– బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్ కుమార్
– డాక్టర్ గుండాల ఆధ్వర్యంలో ‘గడప గడపకు బీఎస్పీ ప్రజా ఆశీర్వాద యాత్ర’
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ:
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో ఈ ప్రాంత గడ్డమీద ప్రజల ఆశీర్వాదాలతో నీలి జెండా ఎగురవేస్తామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గుండాల మదన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ‘గడపగడపకు బీఎస్పీ ప్రజా ఆశీర్వాద యాత్ర’ చేపట్టారు. దీక్షకుంట్ల, పనికరా, అమీన్‌పేట, నెక్కొండ మండలకేంద్రంలో ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు, ఓటర్లతో డాక్టర్ గుండాల మదన్ కుమార్ ముచ్చటించారు. నెక్కొండ మండలకేంద్రంలో సభలో మాట్లాడారు.
ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకుడు తీరం చేరిన తర్వాత తెప్ప తగిలేసినట్లు ఉద్యమకారులను వదిలేశారని విమర్శించారు. హైదరాబాద్ కేంద్రంగా తన తాబేదారులే భూదందా ఏజెంట్లతో ‘ధరణి’ సాఫ్ట్ వేర్ ను తీసుకొచ్చి దశాబ్దాల కాలం నాటి భూ యజమాన్య హక్కులను హరించి వేశారని ఆరోపించారు. దాంతో చిన్న, సన్నకారు రైతులకు యాజమాన్య రికార్డులు లేక ఆందోళనలో పడ్డారని వివరించారు. ‘రైతుబంధు’ భూస్వాముల పాలిట వరంగా..కౌలు రైతుల పాలిట అందని ద్రాక్షంగా మారిందని వెల్లడించారు. పేద రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ తీసేయడం వల్ల పెట్టుబడి పెరిగి తగిన మద్దతు ధర లభించక రైతు కుదేలవుతున్నాడని వివరించారు. రాష్ట్రంలో ‘రైతు రాజు’ అనేది సర్కార్ చేస్తోన్న వట్టి బూటకం.. డొల్ల ప్రచారం అని ఆరోపించారు.
తెలంగాణ తల్లి నెత్తిపై లక్షల కోట్ల అప్పుల మూట
కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు ద్వారా..‘పావలా పాకానికి భారాన మసాలా’ అన్న చందంగా తెలంగాణ తల్లి నెత్తిపై లక్షల కోట్ల అప్పుల మూటను కిరీటంగా ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు గుదిబండ కానుందని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుకు బాటలు వేయకుండా..ఇంటికో బెల్ట్ షాప్ తో యువత భవిష్యత్తును అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రం అని బడాయికి పోతున్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ ప్రజా అవసరాలపై ప్రభుత్వ భూములను కాపాల్సిన ప్రభుత్వమే భూముల అమ్మకమును అభివృద్ధిగా చెప్పడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానన్న కేసీఆర్ఱ్ ప్రభుత్వం తన కుటుంబం చుట్టూ అభివృద్ధి కేంద్రీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారని అన్నారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో అనైతిక దారులలో ప్రతిపక్షాలను భూస్థాపితం చేశారని..ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని వివరించారు.
నర్సంపేటలో రోడ్ల పరిస్థితి దారుణం
నర్సంపేట నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చూస్తుంటే దారుణంగా ఉందని చెప్పారు. ఇండ్లు లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ‘డబుల్’ ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ‘దళిత బంధు’, ‘బీసీ బంధు’ అని ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం ఆటలు ఇకపై సాగవు అని జోస్యం చెప్పారు. బహుజనులం అందరం ఏకమవుతున్నామని తెలిపారు.
అన్ని వర్గాలను మోసం చేస్తోన్న రాష్ట్రసర్కార్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 9 సంవత్సరాల నుంచి తెలంగాణను గాలికి వదిలేసి అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. అలవి కాని అనేక హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద సుదర్శన్ రెడ్డికి బహుజనులు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎస్పీ నర్సంపేట నియోజకవర్గ బాధ్యులు, జిల్లా కార్యదర్శి బుర్రి సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాసం రమేష్, ఒంటరి రాములు, తనుగుల శ్రీకాంత్, గజ్జి దయాకర్, సౌరం, ప్రసంగి, చందు తదితరులు పాల్గొన్నారు.