వేద న్యూస్, జమ్మికుంట:
ప్రపంచ ఫ్యాటీ లివర్ డే” (World Fatty Liver Day) ను తెలుగులో “గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే” అని పిలుస్తారు. ఇది 2025 సంవత్సరం జూన్ 12న జరుపుకుంటారు. ఈ రోజున, కాలేయ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం, నివారణ చర్యలు, మరియు మద్దతు అందిస్తారు. ఈ నేపథ్యంలో.. జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ సదరు డిసీజ్ గురించి వివరించారు.

ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్,.. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలతో ముందుగానే గుర్తించండి, నిర్లక్ష్యం చేస్తే మీకే నష్టం అని హెచ్చరించారు.
సాధారణంగా మన కాలేయంలో కొంత కొవ్వు ఉంటుంది. కానీ ఈ కొవ్వు కాలేయం మొత్తం బరువులో 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువగా మారినప్పుడు, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తారు.
ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇదీ ముప్పుగా మారుతుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ (Fatty Liver) అంటే కాలేయంలో లేదా లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. సాధారణంగా కాలేయంలో కొంత కొవ్వు ఉండటం సహజమే, కానీ అది పరిమితికి మించి పేరుకుపోతే అది సమస్యగా మారుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య.
ఫ్యాటీ లివర్‌కు దారితీసే ప్రధాన కారణాలను వివరించారు. ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధికంగా మద్యం సేవించడం, ఊబకాయం, మధుమేహం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారకాలని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, దీని గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చివరికి గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఊబకాయం: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ.
మధుమేహం: టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత కారణంగా కొవ్వు కాలేయంలో పేరుకుపోతుంది.
అధిక కొలెస్ట్రాల్ / ట్రైగ్లిజరైడ్స్: రక్తంలో అధిక కొవ్వు స్థాయిలు ఫ్యాటీ లివర్‌కు దారితీస్తాయి.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు, అధిక కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం.
శారీరక శ్రమ లేకపోవడం: ఎలాంటి వ్యాయామాలు, శారీరక శ్రమ లేకపోతే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదపడుతుంది.
మెటబాలిక్ సిండ్రోమ్: ఇది ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక చక్కెర స్థాయిలు, , అధిక కొలెస్ట్రాల్ కలయిక.
ఫ్యాటీ లివర్ లక్షణాలు
చాలా మంది ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఈ వ్యాధి ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అవ్వండి.
అలసట, బలహీనత: నిరంతరం అలసిపోయినట్లు అనిపించడం.
కుడి వైపు పొత్తికడుపు పై భాగంలో నొప్పి లేదా అసౌకర్యం: కాలేయం ఉండే ప్రదేశంలో నొప్పి లేదా బరువుగా అనిపించడం.
ఆకలి లేకపోవడం: ఆహారంపై ఆసక్తి తగ్గడం.
బరువు తగ్గడం: ఆకస్మికంగా బరువు తగ్గడం.
కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు): ఇది తీవ్రమైన కాలేయ సమస్యలకు సంకేతం.
కాళ్ళలో వాపు (ఎడెమా): ముఖ్యంగా పాదాలు, చీలమండల వద్ద వాపు.
చికిత్స, నివారణ
ఆహారపు అలవాట్లలో మార్పులు: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, షుగరీ డ్రింక్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి. లీన్ ప్రోటీన్ అంటే చికెన్, పప్పులు, చేపలు మీ ఆహారంలో భాగం చేసుకోండి.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నవారు పూర్తిగా ఆల్కహాల్‌ను మానేయాలి.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నవారు కూడా ఆల్కహాల్ జోలికి పోకండి.
ఫ్యాటీ లివర్ నిర్ధారణ అయినట్లయితే, వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స , జీవనశైలి మార్పుల గురించి సలహా తీసుకోవాలి