• విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బరిలో..
  • రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ పత్రాల సమర్పణ

వేద న్యూస్, హన్మకొండ:
నిరుద్యోగులతో ఏర్పాటైన ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’ తరఫున పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామానికి చెందిన యువకుడు సంగెకారి యువరాజ్ నామినేషన్ వేశారు. పరకాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ వో)కు బుధవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సంగెకారి యువరాజ్ మాట్లాడుతూ విద్యావంతుడినైన తాను నిరుద్యోగుల తరఫున గళం వినిపించేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

36 వేల మంది నిరుద్యోగులను ఏ రాజకీయ పార్టీ కూడా ఆదుకోలేదని, అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులు యెచ్చు సునీల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్రికెట్ బ్యాట్ గుర్తుపై విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పరకాల నియోజకవర్గ ప్రజలను ఆ పార్టీ అభ్యర్థి సంగెకారి యువరాజ్ అభ్యర్థించారు. విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ‘రైతు బంధు’ కింద ఏడాదికి రైతులకు రూ.36 వేలు ఇస్తామని, విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తామని చెప్పారు.