ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’పై ప్రచారం

– జనానికి అర్థమయ్యేలా వివరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

వేద న్యూస్, ఆసిఫాబాద్:

ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేవెళ్ల ‘ప్రజాగర్జన’ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేయగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా, డిక్లరేషన్‌లోని అంశాలను కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేత రాథోడ్ శేషారావు నాయకత్వంలో కార్యకర్తలు ఆదివారం వివరించారు. డిక్లరేషన్‌కు సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోడేఘాట్‌లోని కుమురం భీమ్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. అనంతరం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కెరమేరీ మండలంలోని బాబేఝరి, జోడేఘాట్ గ్రామాల ప్రజలకు ‘గడప గడప’కు తిరిగి డిక్లరేషన్ పై అవగాహన కల్పించారు. జనానికి అర్థమయ్యేలా డిక్లరేషన్ లోని అన్నీ అంశాలను కార్యకర్తలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పట్ల ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోందని కార్యకర్తలు చెప్తున్నారు. ఈ డిక్లరేషన్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నరేందర, సురేష్, పరమేశ్వర్, శేఖర్,సాగర్, ప్రసాద్, భాస్కర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.