= అంతర్గత సర్వేలు చేయిస్తున్న ప్రధాన పార్టీలు
= ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌కు 78 సీట్లు వస్తాయన్న కేటీఆర్
= డీలిమిటేషన్ తర్వాత 182 స్థానాలకు గానూ 117 సీట్లు గెలుస్తామన్న రేవంత్
= పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఇరు పార్టీల నంబర్ గేమ్
= సొంత పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై ఇరు పార్టీల అధిష్ఠానాల సీక్రెట్ సర్వేలు
= పనిచేయని వారికి వచ్చే ఎన్నికల్లో సీట్ కట్
= పనిచేయని సిట్టింగ్‌ల స్థానంలో సైలెంట్‌గా ప్రత్యామ్నాయ నేతలకు ప్రాధాన్యత
= దూకుడు పెంచిన రెండు పార్టీల అగ్రనేతలు
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర రాజకీయాలు కొంత కాలంగా వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా-నేనా అన్నట్టు వ్యూహాప్రతివ్యూహాలతో పొలిటికల్ మైండ్ గేమ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలపై ఇరు పార్టీల అగ్రనేతలు రహస్యంగా సీక్రెట్ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సర్వేల సారాంశాన్ని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రస్తావించడంతో తెలంగాణలో సర్వే పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఏయే స్థానాల్లో పార్టీ పటిష్టంగా ఉంది?, ఎక్కడెక్కడ బలహీనపడింది? అనే అంశాలపై ఇరు పార్టీల అధిష్ఠానాలకు ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం.
78 సీట్లతో అంటూ కేటీఆర్
రెండు పార్టీల మధ్య నంబర్ గేమ్ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీకాలం ముగిసేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంటెలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వ అంతర్గత సర్వేల ప్రకారమే ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ ఏకంగా 78 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ప్రకటించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే వాతావరణాన్ని క్షేత్రస్థాయిలో సృష్టించడం ద్వారా.. పార్టీ ఫిరాయింపులకు గట్టిగా బ్రేక్ వేయడంతో పాటు నియోజకవర్గాల్లోని క్యాడర్‌లో సరికొత్త పొలిటికల్ ఉత్సాహాన్ని నింపాలనేది కేటీఆర్ అనుసరిస్తున్న ప్రధాన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.
పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు..
వరుసగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం.. అదే సమయంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కండువాలు మార్చి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండటంతో గులాబీ కేడర్ కొంత కన్‌ఫ్యూజన్‌లో పడింది. ఇలాంటి క్లిష్టమైన తరుణంలో పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ధైర్యం కల్పించడం అత్యంత అవసరమని గులాబీ లీడర్‌షిప్ భావిస్తోంది. అందుకే వచ్చేది మన ప్రభుత్వమేనని బలంగా నమ్మకం కలిగించడం కోసం కేటీఆర్ సర్వేల అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ వ్యూహం ద్వారా పార్టీని వీడాలనుకునే వారిలో పునరాలోచన కలిగించడంతో పాటు, గ్రామాల్లో కేడర్ మళ్లీ యాక్టివ్ అయ్యేలా గ్రౌండ్ వర్క్ వేగవంతం చేస్తున్నారు.
117 సీట్లతో రేవంత్ కౌంటర్..
కేటీఆర్ సర్వే లీకులకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే వ్యూహాత్మకంగా, అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తెచ్చే డీలిమిటేషన్ బిల్లు ద్వారా నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 182కి పెరుగుతుందని అంచనా వేస్తూ.. అందులో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 సీట్లు క్లీన్ స్వీప్ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఫేక్ సర్వేల ప్రచారాన్ని, మైండ్ గేమ్‌ను తిప్పికొట్టడానికి రేవంత్ రెడ్డి ఈ భారీ నంబర్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చారు. దీనిద్వారా అటు ప్రతిపక్షాల నోళ్లు మూయించడంతో పాటు, ఇటు సొంత పార్టీలో అక్కడక్కడా వ్యక్తమవుతున్న అసంతృప్తిని తొక్కిపెట్టవచ్చనేది ముందస్తు వ్యూహంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల పనితీరుపై సీక్రెట్ నిఘా..
ఈ సర్వేల ఉద్దేశం కేవలం పార్టీల బలాన్ని అంచనా వేయడమే కాకుండా, సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరును కూడా గుట్టుచప్పుడు కాకుండా పసిగట్టడమేనని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు? ఎవరు కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతున్నారు? అనే పూర్తి రిపోర్ట్ ఇప్పటికే పార్టీ పెద్దల వద్ద సిద్ధంగా ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉండి, నియోజకవర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యేల ప్లేసులో ప్రత్యామ్నాయంగా వేరే నేతలకు అవకాశం ఇచ్చేలా పార్టీలు పరిశీలిస్తున్నాయి. అయితే, పాతవారిని ఇప్పుడే డిస్టర్బ్ చేయకుండా, వారు మారేందుకు సమయం ఇస్తూనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో కొత్త లీడర్లను అంతర్గతంగా ఎంకరేజ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీట్ కట్ అవుతుందని సర్వేల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పేలుతున్న మాటల తూటాలు
ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు పార్టీలకూ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు, పాలనా మార్కుతో జనాల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంటే.. బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సర్వేల మైలేజీతో దూసుకుపోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందన్న హెచ్చరికలు ఇరు పార్టీల లీడర్లలో గుబులు రేపుతున్నాయి.
