వేద న్యూస్, హనుమకొండ :
“పరుగులు ఆరోగ్యం కోసం… రక్తదానం ప్రాణాల కోసం” అనే నినాదంతో లూపిన్ వరంగల్ కమ్యూనిటీ తమ 15వ రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండలోని భారత రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జెన్-జెడ్ యువత ఫిట్‌నెస్‌తో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలి. పరుగులు ఆరోగ్యాన్ని పెంపొందిస్తే, రక్తదానం ప్రాణాలను కాపాడుతుంది. యువత స్వచ్ఛంద రక్తదానం, ఆరోగ్య అవగాహన మరియు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరానికి యువత విశేషంగా స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా పలువురు యువకులు ముందుకు వచ్చి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి విశేషంగా సహకరించిన కె. దీపక్ రెడ్డి, ఎం. రాజా విక్రమ్ రెడ్డిలకు లూపిన్ కమ్యూనిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ శిబిరాన్ని లూపిన్ కోర్ టీమ్ సభ్యులు శ్రీకర్ తాటికొండ, విష్‌పాత్ నమోజు, సిద్ధార్థ్ మాతూరి, గోపు సాత్విక్, వంశీ గౌడ్ బొల్లపెల్లి, శేషు ఎంజాల, విశ్వక్ నోముల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ నేహాల్, శృతి, హర్షిణి రెడ్డి, భారత రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు, కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులకు లూపిన్ కమ్యూనిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఫిట్‌నెస్‌తో పాటు సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని లూపిన్ నిర్వాహకులు తెలిపారు.
