వేదన్యూస్ – నాంపల్లి
అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లోకి చేరనున్నారా..?. గతంలో అధికారం కోసమో.. పదవుల కోసమో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. కారణం ఏదైన సరే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి తమ గూటీకి చేరాలని బీఆర్ఎస్ ముఖ్యులకు సమాచారం పంపారా..?. ఇప్పటికే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం నిఖార్సైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు. తమకు ఎలాంటి అవకాశం ఉండదని నిర్ణయం తీసుకున్నారా..?.
పదిహేను నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పై వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో మరో రెండు దశాబ్ధాలైన కాంగ్రెస్ కు అధికారం కాదు కదా కనీసం డబుల్ డిజిట్ స్థానాలు కూడా రావని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యారా..?. అందుకే తిరిగి బీఆర్ఎస్ లో చేరాలని అనుకుంటున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలల్లో ఎనిమిది మంది తిరిగి సొంతగూటికి చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
పార్టీలో చేరే సమయంలో ఉన్న ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గడమే కాకుండా కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. రేవంత్ కంటే కేసీఆరే నయం. నెలకో రెండు నెలలకో కల్సిన పనులు మాత్రం తక్షణమే అయ్యేవి. నియోజకవర్గానికి నిధులు మంజూరయ్యేవి. పార్టీ మారిన పది నెలలుగా సొంత పనులు పక్కనెట్టు కనీసం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా నిధులు మంజూరు కానీ పరిస్థితి ఏర్పడింది. ఇలాగే కంటిన్యూ అయితే వచ్చేన్నికల్లో తమకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం . అందుకే ముందు చూపుతో మేల్కోని తప్పు తెలుసుకుని తిరిగి సొంత గూటికి చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.