వచ్చే ఎన్నికల్లో ఏ పేరుతో కారు పార్టీ బరిలోకి..?
= గులాబీ దళంలో ‘పేరు’ మార్పు ప్రకంపనలు
= ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను మళ్లీ అక్కున చేర్చుకుంటారా?
= మల్లగుల్లాలు పడుతున్న బీఆర్ఎస్ పెద్దలు
= తెలంగాణ ఆకాంక్షకు దూరం కావడమే శాపమైందా?
= పేరు మార్చి కొంపముంచుకున్న గులాబీ బాస్
= ‘టీఆర్ఎస్’ పేరు కలిసేలా కవిత కొత్త పార్టీకి ప్లాన్
= అదే నిజమైతే గులాబీ పార్టీకి భారీ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు
= ‘పాత పేరే ఆలోచిస్తున్నాం..’ కేటీఆర్ హడావిడి ప్రకటనలు అందుకోసమేనా?
= అసలు కారు పార్టీలో అసలేం జరుగుతోంది?
వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్’ చర్చ నడుస్తోంది. రెండు దశాబ్దాల పాటు తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ పార్టీ, జాతీయ రాజకీయాల ఆశతో తన పేరును మార్చుకుని నేడు అస్తిత్వ సంక్షోభంలో పడిందా? పేరు మార్పు నిర్ణయమే ఆ పార్టీ కొంపముంచిందా? ఇప్పుడు మళ్లీ పాత పేరుతోనే ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తోందా? వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకేనా? లేక కవిత తన తండ్రి వద్దుకున్న ‘టీఆర్ఎస్’ పేరుతో కలిసొచ్చే పేరుతో తన కొత్త పార్టీని స్థాపించాలనుకుంటున్నారా? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి?
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించినప్పుడు అది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక ఆకాంక్ష. ఆ పేరులోనే తెలంగాణ ఉండటం వల్ల పల్లె జనం, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ ఆ పార్టీని తమ సొంత సంస్థగా భావించారు. ‘గులాబీ జెండా – తెలంగాణ అజెండా’ అనే నినాదం జనాల్లోకి బలంగా వెళ్లింది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్ర సాధన సాధ్యమైందన్నా, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారన్నా.. దానికి టీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇమేజ్ ప్రధాన కారణం. సబ్బండ వర్ణాల నోళ్లలో నానిన ఆ పేరును తీసేయడం అంటే, ఒక బలమైన భావోద్వేగ పునాదిని కూల్చేయడమేనని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ రాజకీయాల భ్రమలో..
జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే భారీ లక్ష్యంతో 2022 అక్టోబర్‌లో టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. అయితే, ఈ మార్పు ప్రజల్లోకి వెళ్లడంలో విఫలమైందనేది అక్షర సత్యం. తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా నమ్మిన ఓటర్లకు బీఆర్ఎస్ అనే పేరులో తమ ప్రాంతీయ మూలాలు కనిపించలేదు. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు కోల్పోయింది. పేరులో తెలంగాణ లేకపోవడం వల్లే తాము అనాథలమయ్యామని ఉద్యమకారులు భావించారు. మనం మన తెలంగాణను వదిలేసి దేశం మీదకు వెళ్తే, ఇక్కడ మన పట్టు జారిపోదా? అన్న చర్చ అప్పట్లోనే సాగింది. ఇప్పుడు అదే నిజమైందని ఫలితాలు నిరూపించాయి.
కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
ఇటీవల మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోంది.. దీనిపై పార్టీలో చర్చ జరుగుతోంది అని ఆయన పేర్కొనడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో పోయిన ఉత్సాహాన్ని తిరిగి తేవడం, మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి, కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవడం. కానీ, ఈ నిర్ణయం వెనుక కుటుంబ అంతర్గత రాజకీయాలు కూడా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కవిత కొత్త పార్టీ ప్లాన్.. అన్నకు చెక్ పెట్టడానికేనా?
ప్రస్తుతం వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కేసీఆర్ తనయ కవిత తన తండ్రి వదిలేసిన టీఆర్ఎస్ పేరును మళ్లీ తెరపైకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన తండ్రి కష్టపడి నిర్మించిన ఆ బ్రాండ్‌ను వృథా పోనివ్వకూడదని, అవసరమైతే టీఆర్ఎస్ పేరుతోనే ఆమె కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ కవిత నిజంగానే టీఆర్ఎస్ పేరుతో ముందుకొస్తే, అది కారు పార్టీకి (బీఆర్ఎస్) కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఓట్లు చీలిపోవడమే కాకుండా, అసలైన టీఆర్ఎస్ మాదే అని ఆమె వాదిస్తే క్యాడర్ మొత్తం ఆమె వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ ముప్పును పసిగట్టిన కేటీఆర్, ముందస్తు జాగ్రత్తగా తామే మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతామని ప్రకటించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికలే లక్ష్యం..
పార్టీ పేరు మార్చడం అనేది కేవలం బోర్డులు మార్చినంత సులభం కాదు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెద్ద ప్రక్రియ ఉంటుంది. అయినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తెలంగాణ అనే బ్రాండ్ కచ్చితంగా ఉండాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ పేరుతో వెళ్తే జాతీయ పార్టీగా ముద్ర పడి, లోకల్ సమస్యలపై పట్టు కోల్పోతామనే భయం వారిని వెంటాడుతోంది. తెలంగాణ అస్తిత్వమే ఆయుధంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కారు పార్టీకి, ఈ పేరు మార్పు ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ కవిత ఎఫెక్ట్ నిజమైతే, అది గులాబీ కుటుంబంలో మరిన్ని చిచ్చులకు దారి తీసే అవకాశం ఉంది. ఏది ఏమైనా, టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుంది.