వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేసే ప్రయత్నాలను సహించబోమని, ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం వరంగల్ వెంకట్రామ జంక్షన్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేస్తూ, కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అయూబ్ మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న నాయకుడిపై కేసులు పెట్టి ఆయన గొంతును అణచివేయాలని చూడటం సరికాదు. ప్రశ్నించే గొంతును కేసులతో అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు” అని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేసుల పేరుతో రాహుల్ గాంధీ గొంతును నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది ఒక్క రాహుల్ గాంధీపై జరుగుతున్న దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉందని, అధికారంలో ఉన్న వారు విమర్శలను స్వీకరించి ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీపై ఎన్ని కేసులు పెట్టినా ఆయన ప్రజా పోరాటాన్ని ఆపలేరు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు అండగా నిలుస్తాయి. కాంగ్రెస్ పోరాటం వ్యక్తుల కోసం కాదు.. ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం” అని అయూబ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాజకీయ కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే చర్యలను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ సంఘ్ వెంకటరాజ్యం, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ సెల్ల నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, టౌన్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
