వేద న్యూస్, హనుమకొండ :
ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకులు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అక్రమ సంపాదనతో కూడబెట్టిన డబ్బుతో ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాల పేరుతో వస్తువులు పంపిణీ చేయడం సిగ్గుచేటని, అలాంటి కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకావడం బాధాకరమన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేసిన వ్యక్తులే నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన కార్యక్రమాలను రాజకీయ వేదికలుగా మార్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాడ వీధుల అభివృద్ధికి రూ.11 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించి జూన్ 12న రూ.19 కోట్ల నిధులు మంజూరు చేయించామని, వాటిని గత ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. నగరంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి హైడ్రా తరహాలో తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ నగర్ భూముల అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూమి ప్రభుత్వ భూమిగా తేలితే ప్రజా రవాణా, పరిపాలనా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. వరంగల్ నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతులు వచ్చిన సమయంలో మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తిచేసినా నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు ఇటీవల ఇళ్ల పట్టాలు అందించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. మతపరమైన భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న బీజేపీ నాయకులు తెలంగాణకు చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ దుర్వినియోగం చేయనని, ప్రజల అభ్యున్నతి, అభివృద్ధే తన లక్ష్యమని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పనిచేసే నాయకులను ప్రజలు ఆదరిస్తారని, అభివృద్ధి చేయలేకపోతే ప్రజలే పక్కన పెడతారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తోందని, మహనీయుల సేవలను స్మరించుకుంటూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
