వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : 

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ జిల్లా సాండ్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయుడు ఆరోపించారు. జూన్ 20న కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌ల పరిధిలో ఇసుక క్వాంటిటీని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు.అయితే, ఈ కొత్త ఇసుక రీచ్‌ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. రోడ్డు సదుపాయం లేకపోవడం, ఇసుక లోడింగ్‌కు అవసరమైన యంత్రాలు (మిషన్లు) అందుబాటులో లేకపోవడం, అలాగే పర్యవేక్షణ కోసం అవసరమైన సిబ్బంది (ఎంప్లాయ్స్) నియమించకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

కాంట్రాక్టర్లతో ముందస్తు సంప్రదింపులు లేకుండా, క్వారీ ప్రాంతాల వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా క్వాంటిటీ కేటాయింపులు చేయడంతో, ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న లారీ యజమానులు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు.

ఇప్పటికైనా TGMDC అధికారులు ప్రతిరోజూ లోడింగ్ పరిస్థితులను సమీక్షించి, వాస్తవంగా ఇసుక అందుబాటులో ఉన్న రీచ్‌లనే ఆన్‌లైన్‌లో ఉంచాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. లోడింగ్ సాధ్యం కాని పరిస్థితుల్లో, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న లారీలను సమీపంలోని ఇతర రీచ్‌లకు తక్షణమే బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో పలుమార్లు ఈ సమస్యపై విన్నవించినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదని, ఇకనైనా ఈ తరహా సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని TGMDC సంస్థను కోరుతున్నామని లారీ యజమానులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *