= యథేచ్ఛగా అక్రమ గర్భ విచ్ఛిత్తి
= క్లినిక్ ల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ దాకా విస్తరించిన ముఠా
= తాజాగా హైదరాబాద్ లో పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌
= గర్భిణిగా నటించి ముఠాను పట్టిన లేడీ పోలీస్
= విస్తుపోయే నిజాలు వెలుగులోకి..
= చట్ట విరుద్ధంగా లింగనిర్ణారణ.. విచ్చలవిడిగా అబార్షన్లు
= శిశువు లింగంపై సైగ చేసినా ఐదేళ్ల జైలు అని చెబుతున్న చట్టం
= అయినా కాసుల వేటలో కొన్ని ఆస్పత్రులు

వేద న్యూస్, క్రైం బ్యూరో
రాష్ట్రంలోని పలు జిల్లాలు సహా.. రాజధాని హైదరాబాద్ నగరంలో అక్రమ లింగనిర్ధారణ, గర్భ విచ్ఛిత్తి కార్యకలాపాలు ఎలాంటి జంకూ లేకుండా యథేచ్ఛగా సాగుతున్నాయి. చిన్నచిన్న గల్లీ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంల నుంచి కార్పొరేట్ స్థాయి పెద్ద ఆస్పత్రుల వరకు ఈ అక్రమ దందా గొలుసుకట్టు మాదిరిగా విస్తరించింది. ఇటీవల వెలుగుచూసిన ఉదంతాలే ఇందుకు సజీవ తార్కాణంగా నిలుస్తున్నాయి. తాజాగా ఎల్బీనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన ఓ డెకాయ్ ఆపరేషన్ లో నగరంలో సాగుతున్న ఈ నయా దగాకు సంబంధించిన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ నెట్‌వర్క్‌గా ఏర్పడి పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది.

గర్భిణిగా లేడీ పోలీస్
గర్భంలో ఉన్న బిడ్డ ఆడ, మగ అని తేల్చేస్తూ చట్టానికి వ్యతిరేకంగా దందా సాగిస్తున్న ముఠా నెట్‌వర్క్‌ను వనస్థలిపురం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పెద్ద ఎత్తున గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పోలీసులు ఒక సినీ ఫక్కీ ప్లాన్ వేశారు. నిందితులను బురిడీ కొట్టించేందుకు ఓ మహిళా పోలీస్ అధికారిని గర్భిణిగా నటింపజేశారు. ఆమెను ఆస్పత్రికి పంపి, కస్టమర్లలా నటిస్తూ అడ్వాన్స్ డబ్బులు ఆఫర్ చేయగా, నిందితులు ఎలాంటి అనుమానం లేకుండా అబార్షన్‌తో పాటు లింగనిర్ధారణకు అంగీకరించారు. దీంతో పక్కా ఆధారాలతో పోలీసులు దాడులు చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ఈ క్రమంలోనే వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్ నుంచి పలు క్లినిక్ లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న పలు హాస్పిటల్స్ అక్రమ లీలా బాగోతం తేటతెల్లమైంది.

మామూళ్ల మత్తులో..
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 1000కి పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే, ఆయా సెంటర్లపై వైద్య ఆరోగ్యశాఖాధికారుల పర్యవేక్షణ ఎంత ఘోరంగా ఉందో ఈ తాజా ఘటనే నిరూపిస్తోంది. పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో నిర్వాహకులు ఏమాత్రం జంకు లేకుండా, వచ్చినవారు ఎవరనేది కనీసం ఆరా తీయకుండా డబ్బుల కోసం లింగనిర్ధారణ పరీక్షలకు ఒప్పుకున్నారంటే ఈ అక్రమాలు ఏ స్థాయిలో వేళ్లునూనుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ సెంటర్ల నుంచి అధికారులకు నెలవారీగా భారీగా మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పలు జిల్లాల్లోని స్కానింగ్ సెంటర్లు సైతం యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేస్తూ అబార్షన్లకు పురుకొల్పుతున్నాయి. అధికారుల నిరంతర నిఘా లోపం వల్లే సామాజిక అవగాహన లేని అమాయకులను టార్గెట్ చేస్తూ ప్యాకేజీల పేరిట ఈ ఆస్పత్రులు లక్షల్లో డబ్బులు గుంజుతున్నాయి.

అసలు చట్టం ఏం చెబుతుంది..?
భారతదేశంలో అమల్లో ఉన్న పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం గర్భంలో ఉన్న బిడ్డ ఆడ లేదా మగ అని చెప్పడం అత్యంత తీవ్రమైన నేరం. స్కానింగ్ కేంద్రాల్లో డాక్టర్లు కానీ, టెక్నీషియన్లు కానీ గర్భస్థ శిశువు లింగంపై మాట్లాడటం, కాగితంపై రాయడం, లేదా సైగ చేయడం కూడా నేరమే అవుతుంది. ప్రతి గర్భిణికి స్కాన్ చేసినప్పుడు అందుకు గల బలమైన కారణం, తల్లిదండ్రుల పూర్తి వివరాలను ‘ఫారం ఎఫ్’లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి నెలా ఈ రికార్డుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక రూపంలో సమర్పించాలి. ఒకవేళ ఈ చట్టాన్ని అతిక్రమించినట్లయితే.. మొదటి సారి తప్పు చేస్తే 3 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండవసారి కూడా అదే తప్పు చేస్తే ఏకంగా 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల వరకు భారీ జరిమానాతో పాటు సదరు స్కానింగ్ సెంటర్ లేదా హాస్పిటల్ గుర్తింపును శాశ్వతంగా రద్దు చేస్తారు.

ప్యాకేజీల దందాపై ఉక్కుపాదం మోపాలి
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో లింగ నిర్ధారణ, అబార్షన్లు జరుగుతున్నాయన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. నగరంలోని అధిక శాతం స్కానింగ్ సెంటర్లలో ఫారం ఎఫ్ నింపకుండానే గుట్టుచప్పుడు కాకుండా దందాలు నడిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఏజెంట్లను పెట్టుకుని లక్షల రూపాయల ప్యాకేజీల పేరుతో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. చట్టాన్ని హేళన చేస్తూ పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నకిలీ వైద్య కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిరంతర దాడులు నిర్వహించాలని, బాధ్యులపై ఉక్కుపాదం మోపాలని నగరవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *