వేద న్యూస్, గీసుకొండ :

మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ, పీవీసీ కొమ్మాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉచిత ముద్ద చర్మ వ్యాధి (లంపీ స్కిన్ డిసీజ్) నిరోధక టీకాల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ కన్నెబోయిన యమున ప్రవీణ్ యాదవ్ శిబిరాన్ని, పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యమున పశువుకు టీకా వేసే ప్రక్రియను పరిశీలించారు.

పాడి రైతులకు అండగా ప్రభుత్వం : సర్పంచ్ యమున

ఈ సందర్భంగా సర్పంచ్ కన్నెబోయిన యమున ప్రవీణ్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమ కీలక భూమిక పోషిస్తుందని, రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పశువులకు ప్రాణాంతకంగా మారుతున్న ముద్ద చర్మ వ్యాధి నిర్మూలనకు పశువైద్య శాఖ ఉచితంగా టీకాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి ఉచిత వైద్య సదుపాయాలను, శిబిరాలను కొమ్మాల గ్రామ పరిధిలోని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని పశువులన్నింటికీ ముద్ద చర్మ వ్యాధి సోకకుండా ముందస్తుగా ఈ నిరోధక టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. టీకాలు వేయడంతో పాటు ప్రతి పశువు చెవికి తప్పనిసరిగా ట్యాగ్ వేసి, వాటి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వ ‘పశుధన్ పోర్టల్’ లో ఆన్‌లైన్ చేస్తున్నామని వివరించారు. దీనివల్ల పశువుల ఆరోగ్య రికార్డులు భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 46 పశువులకు విజయవంతంగా టీకాలు వేసినట్లు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. పశుగ్రాస కొరత, సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీ క్రిష్ణ, పశువైద్య శాఖ సిబ్బంది కవికుమార్, సుమన్ జిత్కూర్, చందు, జితేందర్, గోపాలమిత్రులు ఇస్మాయిల్, రమేష్‌లతో పాటు గ్రామానికి చెందిన పలువురు రైతులు,పాడి పనివారలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *