= పంచ్ కొట్టి విధులకు ఎగనామం
= కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తీరు..
= గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ స్కామ్
= విధులు నిర్వహించకుండానే ప్రతి నెల రూ. 14,500 పైగా జీతం డ్రా
= నెలకు సుమారు రూ. 70 లక్షల చొప్పున అక్రమార్కుల జేబుల్లోకి..
= ఐదేళ్లుగా రూ.కోట్లలో ప్రజాధనం స్వాహా
= పబ్లిక్ హెల్త్ వర్కర్ల పేరుతో 452 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
= వీరిలో 70శాతం నుంచి 80శాతం మంది నకిలీలే ఉన్నట్లు ఆరోపణలు
= పనిచేయకుండా థంబ్ వేసి జారుకుంటున్న కేటుగాళ్లు
= గత అధికారులు, తాజామాజీ కార్పొరేటర్ల అండదండలతోనే..
= ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్తల ఫిర్యాదు
= సమగ్ర విచారణకు డిమాండ్

వేద న్యూస్, ఫోకస్ టీమ్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బూటకపు ఉద్యోగాల బాగోతం వెలుగులోకి వచ్చింది. నగర పరిశుభ్రత కోసం క్షేత్రస్థాయిలో శ్రమించాల్సిన విభాగంలో కొందరు అక్రమార్కులు చేరి పనిచేయకుండానే జీతం దండుకుంటూ మున్సిపల్ ఖజానాను గుల్ల చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ హెల్త్ (పీహెచ్) వర్కర్స్ పేరుతో ఏకంగా 452 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కేవలం కొంతమందే పనిచేస్తుండగా, 70శాతం నుంచి 80శాతం మంది రికార్డులకే పరిమితమై నెలనెల వేల రూపాయల జీతాలను యథేచ్ఛగా నొక్కేస్తున్నారు. విధులకు ఒక్క రోజు కూడా హాజరుకాకపోయినా, ఎలాంటి పనులు చేయకపోయినా వీరికి ప్రతి నెలా రూ. 14,500 పైగా జీతం ఖాతాల్లో జమ అవుతుండటం జీడబ్ల్యూఎంసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

వారి వద్దకే థంబ్ అటెండెన్స్..
ఈ ఔట్ సోర్సింగ్ మాయాజాలంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ 452 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఎప్పుడూ సక్రమంగా విధులు నిర్వహించరు. అటెండెన్స్ వేసి మాయమవడమే వీరి పని. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే.. కార్పొరేషన్‌లో పనిచేసే కొందరు జవాన్లు ఈ అక్రమార్కులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సదరు జవాన్లు బయోమెట్రిక్ థంబ్ మిషన్లను తీసుకుని నేరుగా వారి వద్దకే వెళ్లి మరీ హాజరు వేయించుకుని వస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో వార్డుల్లో పనిచేయకుండానే ఆన్‌లైన్ రికార్డుల్లో మాత్రం వంద శాతం హాజరు చూపిస్తూ సరికొత్త హైటెక్ దోపిడీకి తెరలేపారు.

నెలకు రూ. 70 లక్షలు.. ఐదేళ్లలో కోట్లలో దోపిడీ..
ఈ అక్రమ ఔట్ సోర్సింగ్ నెట్‌వర్క్ కారణంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి నెలా దాదాపు రూ. 70 లక్షల వరకు ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వృథాగా పోతోంది. ఒకట్రెండు రోజులు కాదు.. గత ఐదేళ్లుగా ఈ నకిలీ ఉద్యోగుల తంతు నిరంతరాయంగా సాగుతోందని సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కిస్తే కేవలం జీతాల రూపంలోనే కోట్లాది రూపాయల ప్రజాధనానికి ఈ కేటుగాళ్లు గండి కొట్టారు. నగరంలో కాలువలు తీయడానికి, చెత్త ఊడ్చడానికి సిబ్బంది లేరని మున్సిపల్ అధికారులు చేతులెత్తేస్తుంటే.. మరోవైపు ఎలాంటి పని చేయని వందలాది మంది ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు డిజిటల్ రూపంలో మళ్లుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లీడర్లు, అధికారుల అండదండలతోనే..
మున్సిపల్ కార్పొరేషన్ కళ్లెదుటే ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నా కింది స్థాయి అధికారులు మౌనంగా ఉండటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సంపూర్ణ అండదండలతోనే జీడబ్ల్యూఎంసీలో ఈ భారీ అవకతవకలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరానికి చెందిన కొందరు తాజామాజీ కార్పొరేటర్ల హస్తం ఈ ఔట్ సోర్సింగ్ స్కామ్‌లో స్పష్టంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ అనుచరులను, బంధువులను ఈ పీహెచ్ వర్కర్ల లిస్టులో చేర్పించి, వారి ద్వారా వచ్చే జీతాల్లో కార్పొరేటర్లు, సదరు జవాన్లు వాటాలు పంచుకుంటున్నట్లు అంతర్గత విచారణలో లీకులు వస్తున్నాయి.

కదిలిన సామాజిక కార్యకర్తలు..
నగరంలో పారిశుధ్యం నానాటికీ క్షీణిస్తున్నా, పీహెచ్ వర్కర్ల సంఖ్య రికార్డుల్లో భారీగా ఎందుకు చూపిస్తున్నారనే కోణంలో సామాజిక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఔట్ సోర్సింగ్ నకిలీ ఉద్యోగుల లీలలు బయటపడటంతో ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించారు. కష్టపడి పనిచేసే నిజమైన కార్మికులకు అన్యాయం చేస్తూ, ఔట్ సోర్సింగ్ పేరుతో సాగుతున్న ఈ మాయాజాలాన్ని తక్షణమే అరికట్టాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద తలకాయలను బయటపెట్టాలి..
ఈ భారీ కుంభకోణంపై కేవలం కింది స్థాయి జవాన్లు లేదా ముఠా మేస్త్రీలపై చర్యలు తీసుకుని వదిలేయకుండా.. దీని వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారులను, బడా రాజకీయ నాయకులను సైతం చట్టం ముందు నిలబెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్లుగా జరిగిన జీతాల చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా డ్రా చేసిన కోట్లాది రూపాయలను రికవరీ చేయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ నకిలీలను గుర్తించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తక్షణమే రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని సామాజిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *