= విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాల దందా
= ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు
= కాశీబుగ్గలో టన్నుల కొద్దీ కుళ్లిపోయిన పచ్చళ్లు..
= చింతల్‌లో నాసిరకం వంటనూనెల సీజ్..
= ఎనుమాముల పరిధిలో తొడిమెలు, కెమికల్స్ తో కారంపొడి
= పెరుగులో ఎలుకలు, వడాలో బల్లి..
= నగరవాసుల ప్రాణాలతో కేటుగాళ్ల చెలగాటం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ పరిధిలో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కాసుల కక్కుర్తి కోసం బడా వ్యాపారుల నుండి గల్లీ కొట్టు నిర్వాహకుల వరకు నగరవాసుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేసి, పాడైపోయిన వంటనూనెలు, కుళ్లిపోయిన ముడిసరుకులు, హానికర రసాయనాలు ఉపయోగిస్తూ తినుబండారాలు తయారు చేస్తున్న ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరుసగా నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే భయంకర నిజాలు బట్టబయలవుతున్నాయి.

కాశీబుగ్గలో కుళ్లిపోయిన పచ్చళ్ల దందా..
వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అక్కడ కుళ్లిపోయి, బూజు పట్టిన ముడిసరుకులతో పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో ఈ కుళ్లిపోయిన పచ్చళ్లను చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ దందా నడుపుతున్న అరికెల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని.. రూ. 2.25 లక్షల విలువైన 750 కిలోల టమోటా, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరి, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో కూడిన మొత్తం 2,100 కేజీల కల్తీ నిల్వలను సీజ్ చేసి ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

నాసిరకం వంటనూనెలులా బాగోతం
పచ్చళ్ల కేంద్రమే కాకుండా నగరంలో నాసిరకం వంటనూనెలు వాడుతూ ప్రజలను రోగాల పాలు చేస్తున్న మరో కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. వరంగల్ చింతల్ ప్రాంతంలోని ‘మరియా ట్రేడర్స్’పై టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో వినియోగానికి ఏమాత్రం పనికిరాని, కాలం చెల్లిన, పాడైపోయిన వంటనూనెలు, రంగుల కోసం వాడే హానికర రసాయనాలు భారీగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మరియా ట్రేడర్స్ నుండి రూ. 1,06,780 విలువైన నాసిరకం నిల్వలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై చట్టపరమైన చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.

ఎనుమాములలో కారంపొడి ముఠా..
ట్రైసిటీ పరిధిలో కల్తీ దందా ఏ స్థాయికి చేరిందనడానికి ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘోరమైన సంఘటనలే నిదర్శనం. ఎనుమాముల మార్కెట్ పరిధిలోని హేమశ్రీ, లక్ష్మి సాయి వంటి మిర్చి మిల్లులపై అధికారులు దాడులు చేయగా.. అక్కడ పనికిరాని మిర్చి తొడిమెలు, చెక్కపొడి, గంపెడంత నాసిరకం కెమికల్ రంగులు కలిపి కారంపొడి తయారు చేస్తున్నట్లు తేలడంతో వందలాది బస్తాల కల్తీ పొడిని సీజ్ చేశారు. ఇక హోటళ్ల నిర్వాహకుల అపరిశుభ్రత అయితే పరాకాష్టకు చేరింది. కాశీబుగ్గ ప్రాంతంలోని ఒక హోటల్‌లో కస్టమర్ తింటున్న ‘వడా’లో ఏకంగా చనిపోయిన బల్లి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్‌ను ముట్టడించారు.

పెరుగులో ఎలుక పిల్లలు.. పేరున్న మార్ట్‌లలో క్యాన్సర్ కారకాలు
ఇక నిత్యం గర్భిణులు, చిన్న పిల్లలు తాగే పాలు, పెరుగు ప్యాకెట్లలోనూ నాణ్యత మృగ్యమైంది. వరంగల్‌లోని కొన్ని కిరాణా దుకాణాల్లో విక్రయించిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీల పెరుగు ప్యాకెట్లలో ఏకంగా ఎలుక పిల్లలు రావడం, పాల ప్యాకెట్లలో నాణ్యతా లోపాలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వీటన్నింటికీ మించి నగరంలోని బడా బడా కార్పొరేట్ సూపర్ మార్కెట్లలో లభించే విడి వేరుశనగ గింజల్లో ప్రమాదకరమైన, లివర్ దెబ్బతీసే క్యాన్సర్ కారక ‘ఆఫ్లాటాక్సిన్స్’ ఉన్నట్లు, అలాగే నిత్యం వాడే బెల్లంలో మోతాదుకు మించి సల్ఫర్ డయాక్సైడ్ కెమికల్స్ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

బ్రాండ్ లేని వస్తువులు కొనొద్దు..
నాసిరకం, కల్తీ ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు ప్రాణాంతక క్యాన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు వాటి గడువు తేదీలు, నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని, బ్రాండ్ లేని వస్తువులను కొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. నగరంలో ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా నిల్వ కేంద్రాల సమాచారం తెలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *