= జాతీయ, ప్రాంతీయ పార్టీల పేరుకే చలామణి
= అంతా వ్యక్తిగత పరపతి పెంచుకోవాడానికే పాకులాట
= ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా సోషల్ మీడియా పబ్లిసిటీకే పరిమితం..
= కొందరు ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దల అసంతృప్తి
= పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా సెల్ఫ్ ఇమేజ్ పైనే ధ్యాసంతా..
= చెమటోడ్చి కష్టపడుతున్న అగ్రనేతలు
= క్షేత్రస్థాయిలో పార్టీలను జనాల్లోకి తీసుకెళ్లడంలో కొందరు సిట్టింగ్‌లు విఫలం
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఇప్పుడు ఆయా పార్టీల అధిష్ఠానాలకు పెద్ద తలనొప్పిగా మారింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలలో ఉంటూ.. పేరుకు మాత్రమే పార్టీ లేబుల్ వాడుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని పూర్తిగా గాలికి వదిలేశారనే చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాడటం, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం లేదా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కొందరు ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారు. పార్టీలను జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్న సదరు ఎమ్మెల్యేలు.. కేవలం తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే నిరంతరం పాకులాడుతుండటంపై పార్టీల పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల్లోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి రాజకీయాలను వదిలేసి, కేవలం డిజిటల్ పబ్లిసిటీకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి లేదా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాల్సింది పోయి.. నిత్యం సోషల్ మీడియాలో తామేదో చేస్తున్నట్లు అధిష్ఠానాల దృష్టిలో పడేందుకు తాపత్రయపడుతున్నారు. కనీసం తాము చేసే సోషల్ మీడియా పోస్టులను పార్టీ అధికారిక అకౌంట్లకు ట్యాగ్ చేస్తూ వారి దృష్టిలో పనిచేస్తున్నామనే విధంగా ప్రవర్థిస్తున్నట్లు పార్టీల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలు నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా.. అక్కడ కూడా పార్టీ లైన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే, ఫోటోలకు ఫోజులిస్తూ తమ సొంత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టరేం..
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాల కాలం కావస్తున్నా.. విపక్ష హోదాలో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడటంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతుండటంపై గులాబీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. నియోజకవర్గాల్లో జనం పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సింది పోయి, సదరు ఎమ్మెల్యేలు కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతూ కాలక్షేపం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. పేరుకే పార్టీ పదవుల్లో, జాతీయ-ప్రాంతీయ పార్టీ ముసుగులో ఉంటూ.. నిత్యం తమ ‘సెల్ఫ్ ఇమేజ్’ కోసమే పాకులాడుతున్నారని, పార్టీ సంస్థాగత బలోపేతాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని హైకమాండ్ నిశ్శబ్ద సర్వేల్లో తేలడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
తమ ప్రభుత్వం ఉన్నా..
తమ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ, మండల స్థాయిలలో కనీసం ఒక్కసారి కూడా అధికారిక సమీక్షలు గానీ, పార్టీ అంతర్గత సమావేశాలు గానీ ఏర్పాటు చేయకపోవడాన్ని అధిష్ఠానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకుని నిలబడ్డ కార్యకర్తల సాదకబాధకాలను పట్టించుకోవడం, వారి సమస్యలు స్వయంగా వినడం వంటి కనీస బాధ్యతలను సదరు ఎమ్మెల్యేలు పూర్తిగా గాలికి వదిలేశారనే విషయాన్ని హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. కష్టకాలంలో జెండా మోసిన కేడర్‌ను సమన్వయం చేసుకోకుండా, వారిని పలకరించేందుకు కూడా సమయం కేటాయించకుండా కొందరు లీడర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే గ్రామాల్లో పార్టీ పట్టు కోల్పోతోందని సర్వేల్లో తేలింది.
అగ్రనాయకత్వం కష్టపడుతుంటే..
ఒకవైపు పార్టీలను క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు, ప్రజల్లో మైలేజ్ పెంచేందుకు ఇరు పార్టీల అగ్రనేతలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. నిరంతరం సమీక్షలు, పర్యటనలు, ప్రెస్ మీట్లతో జనం పక్షాన నిలబడుతూ కేడర్‌లో జోష్ నింపేందుకు టాప్ లీడర్‌షిప్ కష్టపడుతోంది. అగ్రనాయకత్వం ఇంతగా కష్టపడుతుంటే.. నియోజకవర్గాల్లో ఉన్న కొందరు ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్య వైఖరి ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పార్టీ అజెండాను పక్కనబెట్టి, కేవలం సొంత ఇమేజ్ కోసం ఆరాటపడుతూ పార్టీల గ్రాఫ్‌ను దారుణంగా పడిపోయేలా చేస్తున్నారని సొంత పార్టీ కేడరే బహిరంగంగా విమర్శిస్తోంది.
అలాంటి వారిపై పార్టీల ఫోకస్
పార్టీలను జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమై, కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతున్న సదరు ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అధిష్ఠానాలు అత్యంత సీరియస్‌గా ఉన్నాయి. నియోజకవర్గాల్లో సొంత మైలేజ్ కోసం పాకులాడుతూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్న లీడర్ల జాబితాను ఇప్పటికే నిఘా వర్గాలు, అంతర్గత సర్వేల ద్వారా అధిష్ఠానాలు తెప్పించుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా, కేవలం వ్యక్తిగత ప్రచారానికే పరిమితమయ్యే నేతలపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కూడా నిరాకరించేందుకు వెనుకాడబోమని పార్టీ పెద్దలు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
