తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో నల్ల బ్యాడ్జీలు ధరించిన వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల హౌస్ సర్జన్లు
వేదన్యూస్ వరంగల్ :
తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ (AYUSH JAC) ఆధ్వర్యంలో, వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల హౌస్ సర్జన్లు స్టైపెండ్ పెంచాలని డిమాండ్ లో భాగంగా నేడు విధులు నిర్వహిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయుష్ హౌస్ సర్జన్లు ఆధునిక వైద్య (అల్లోపతి) హౌస్ సర్జన్లతో సమానంగా రోగులకు సేవలందిస్తూ, అత్యవసర విధులు, వార్డులు, ఓపీలు మరియు ఇతర వైద్య సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ, స్టైపెండ్ విషయంలో తీవ్ర వివక్ష కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
“సమాన పనికి – సమాన స్టైపెండ్” అనే ప్రధాన డిమాండ్‌తో ఈ నల్ల బ్యాడ్జీల నిరసన చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయుష్ హౌస్ సర్జన్ల స్టైపెండ్‌ను అల్లోపతి హౌస్ సర్జన్లతో సమానంగా పెంచడంతో పాటు బకాయిలను విడుదల చేసి, ప్రతి నెలా సకాలంలో స్టైపెండ్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఇప్పటికే ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
