వేద న్యూస్, హనుమకొండ :
పని అదే… బాధ్యతలు అవే… అనుభవం అదే… కానీ హోదా పేరు మార్చగానే జీతం ఎందుకు తగ్గాలి? ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల ఆవేదన ఇది. హోదాల పేర్లు మార్చి వేతనాల్లో కోతలు విధిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. వేతన కోతలు, హోదాల మార్పులు, ఉద్యోగ భద్రత, ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల వేతనాల్లో రూ.500 నుంచి ఏకంగా రూ.14,000 వరకు కోతలు పడుతున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఒకే విధమైన పనులు కొనసాగిస్తూ, అదనపు బాధ్యతలు సైతం నిర్వహిస్తున్న ఉద్యోగుల హోదా పేరును మార్చి వేతనం తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“పని మాత్రం పాతదే… బాధ్యతలు పాతవే… అనుభవం పాతదే… మరి పేరు మార్చగానే జీతం ఎందుకు తగ్గాలి?” అంటూ ఉద్యోగులు ప్రశ్నించారు.
ఇది కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య మాత్రమే కాదు..
మున్సిపల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, నీటి సరఫరా తదితర అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. ఒక శాఖలో నేడు హోదా మారితే.. రేపు మరో శాఖలో వేతన కోతలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. అందుకే ఇది ఒక్క వర్గానికి సంబంధించిన సమస్య కాదని, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యగా చూడాలని పేర్కొన్నారు.
ముందుగా వినతులు..తర్వాత ఉద్యమం
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంప్రదించి వారి సమస్యలను సేకరించాలని నిర్ణయించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న వేతనం కంటే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా వేతన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హోదాలు, డిజిగ్నేషన్లు, వేతనాలను ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించి, ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. “ఒక్కొక్కరిగా పోరాడితే మన గొంతు చిన్నదే.. అన్ని శాఖల ఉద్యోగులు ఏకమైతే మన సమస్య రాష్ట్రం మొత్తం వినాల్సిందే” అని ఉద్యోగులు స్పష్టం చేశారు.
