*ఏడుపాయలలో వైభవంగా కార్తీక దీపోత్సవం..*
*కనువిందు చేసిన ఆకాశ దీపం*
వేద న్యూస్, పాపన్నపేట
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాత ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకుని దీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మంజీరా నదీ పాయల నడుమ కొలువైన అమ్మవారి సన్నిధిలో భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
సాయంత్రం వేళ ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకాశ దీపాన్ని వెలిగించడంతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, సాయిబాబా, మధుసూదన్ రెడ్డి, ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్థివ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.