*ఏడుపాయల్లో కన్నుల పండువగా కార్తీక ఆకాశ దీపోత్సవం*

వేద న్యూస్, పాపన్నపేట

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం కార్తీక శోభతో విరాజిల్లుతోంది.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
మంజీరా నదీ తీరాన వెలిసిన అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈదీపోత్సవ వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా వేలాది ప్రమిదలతో, దీపాల వెలుగులతో దేదీప్యమానంగా మెరిసిపోయింది.మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో మట్టి ప్రమిదలను వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల ‘జై దుర్గా మాతకు జై’ అనే నామస్మరణతో ఏడుపాయల క్షేత్రం మార్మోగింది.
ఆలయ గోపురం వద్ద ప్రత్యేక స్తంభానికి అర్చకులు ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోకకల్యాణం,ప్రజల సుఖశాంతుల కోసం ఈ దీపాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకాశంలో ఎగసిన ఈదీప కాంతులను చూసి భక్తులు భక్తిభావంతో వీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి,సాయిబాబా, మధుసూదన్ రెడ్డి,ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్థివ శర్మ,భక్తులు తదితర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *