po
  • ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక
  • ‘పొన్నం పవనాలు’ శీర్షికన కథనం ప్రచురితం
  • మంత్రిగా అవకాశం వస్తోందని నేతల సంతోషం
  • ప్రజల్లో జోష్ నింపుతూ ఉద్యమనేత ప్రభాకర్ ప్రచారం
  • మాజీ ఎంపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల కృషి
  • సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగిన పొన్నం
  • గౌరవెల్లి బాధితుల్లో మనోధైర్యం నింపిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రభాకర్
  • పొన్నం గెలుపునకు శ్రమించిన ఎన్ఎస్‌యూఐ, సీపీఐ, టీజేఎస్, యూత్ కాంగ్రెస్ నేతలు, అభిమానులు

వేద న్యూస్, హుస్నాబాద్ ప్రతినిధి/ఎల్కతుర్తి:
హుస్నాబాద్ నియోజకవర్గంపై కేసీఆర్ కు ఉన్న సెంటిమెంట్ బ్రేక్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతీ సారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభిస్తారు. అలా ఎన్నికల ప్రచారం షురూ చేస్తే..తప్పక విజయం లభిస్తుందనే నమ్మకం, సెంటిమెంట్ ఉంది. కాగా, ఆ సెంటిమెంట్ ను ఉద్యమనేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బ్రేక్ చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా 20 వేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. పొన్నం గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందే చెప్పింది.

‘పొన్నం పవనాలు!’, ‘హుస్నాబాద్ ‘చేతి’కి బలం’ శీర్షికన వరుస కథనాలను ప్రచురించింది. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పొన్నం ప్రభాకర్ తన ప్రచారంతో ప్రజల్లో విశ్వాసం చూరగొంటున్న సంగతిని సందర్భానుసారంగా ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక వార్తా కథనాలుగా పబ్లిష్ చేసింది. మాజీ ఎంపీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు కష్టపడ్డారు. హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలను ప్రజల మధ్య ప్రస్తావిస్తూ..ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును పొన్నం ఎండగట్టారు.

ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను, ఆరు గ్యారంటీలను పొన్నం బలంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన కౌంటింగ్ లో అదే తేలింది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విజయభేరి మోగించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. హుస్నాబాద్ ఇక ‘హస్తా’బాద్ అయిందని, హుస్నా‘బాద్ షా’ గా పొన్నం ప్రభాకర్ ప్రజల కోసం కొట్లాడుతారని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవి వరించేనా?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి వరించి వస్తుందని నేతలు , కార్యకర్తలు అంటున్నారు. మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అనుభవం కలిగిన పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని పొన్నం అనుయూయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తమ నేత పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి వరిస్తే తమ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..