వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణానికి చెందిన అన్నదమ్ములు మాతృమూర్తిపై తమ ప్రేమను చాటుకున్నారు. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఒక గుడి కట్టించారు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం 2వ వార్డు కు చెందిన సముద్రాల రాధమ్మ (59) మూడేండ్ల క్రితం కరోనా బారిన పడి అకాల మరణం చెందారు. రాధమ్మ కు భర్త సైదయ్య, ముగ్గురు కుమారులు సముద్రాల నందకుమార్, విజయ్ కుమార్, కిరణ్ కుమార్, కూతురు మంద సంతోష సంతానం. మనవలు, మనవరాళ్లతో ఎప్పుడు సంతోషంగా ఉన్న ఈ పెద్దకుటుంబలో కరోనా రూపంలో రాధమ్మను మృత్యువు కబళించింది.

ముగ్గురు అన్నదమ్ములు ఉమ్మడిగా ఉంటూ తల్లి తండ్రులే మనకు మొదటి దేవుళ్లు అని భావించి వారి తల్లి కి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఒక గుడి కట్టించారు. ప్రతి సంవత్సరం వారి తల్లి చనిపోయిన రోజున వారి ఆత్మకు శాంతిచేకూర్చాలని..కుటుంబసబ్యులందరూ దాదాపు 25 మంది సభ్యులు ఒకేదగ్గర వారి జ్ఞాపకార్ధం నివాళులు అర్పించి ఒక వేడుకగా చేసుకుంటారు. తల్లిని దైవంగా భావించి ఒక గుడిలా నిర్మించుకోవడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు.