వేద న్యూస్, జగిత్యాల బ్యూరో :
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేజర్ గ్రామ పంచయతీలో రిజర్వేషన్ రొటేషన్ ప్రకారం సర్పంచ్ స్థానం ఎస్సీలకు కేటాయించాలని మల్యాల గ్రామానికి చెందిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కట్కూరి మల్లేష్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల సతీష్ కుమార్ జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులతో కలిసి శుక్రవారం జగిత్యాల జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మెన్ బి. వెంకటయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మల్యాల గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకూ ఒక్క సారి కూడా సర్పంచ్ స్థానం ఎస్సీ వర్గానికి అవకాశం రాలేదని, పాలకులుగా ఇతర వర్గాల వారు మాత్రమే అధికారం చెలాయిస్తూ ఉంటున్నారు. మండలంలోని దాదాపు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో రొటేషన్ పద్దతి ప్రకారం ఎస్సీలకు అవకాశం వచ్చింది, కానీ మల్యాల మండల కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు అవకాశం రాలేదు. దీనికి కారణం కొందరు రాజకీయ నాయకులు, వాళ్ల మాట జవదాటని అధికారులు, వీరి నిర్లక్ష్యం మరియు కుట్రల వల్లనే గతంలో ఒకసారి రావాల్సిన అవకాశం కూడా రాకుండా చేసారు. కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల ప్రకారం వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ స్థానం ఎస్సీ వర్గానికి అవకాశం వచ్చేలా చూడాలని, దానికి జిల్లా కలెక్టర్, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ చూపాలని, లేని పక్షంలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు తప్పవని, న్యాయ బద్దమైన ఈ సాధనకోసం ఎంతటి పోరాటికైనా సిద్ధమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎస్సీ నాయకులు, ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.