వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ ఎస్సీ కాలనీలో దారిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాలు చిత్తడే అన్నట్టుగా రోడ్డు పై నీళ్లు నిలుస్తున్నాయని, దాంతో తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. 

 

ప్రస్తుత వానాకాల సీజన్ నేపథ్యంలో మరింత జోరుగా వానలు కురుస్తు రోడ్డు అసలు కనిపించదని, దారి వెంట వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు వస్తాయని అంటున్నారు. దీనికి తోడు సీజనల్ డిసీజెస్ ముప్పు పొంచి ఉందని పేర్కొంటున్నారు.

దోమలు , ఇతర కీటకాలు ఇండ్లలోకి వచ్చి.. వాటి ద్వారా వ్యాధులు సోకే ప్రమాదముందని భయపడుతున్నారు. ఈ దారి వెంట నీళ్లు నిలువకుండా బాగు చేసేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.