వేద న్యూస్, ఓరుగల్లు:
రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అందజేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కొమ్ము రంజిత్ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మేరుగు శివకోటి యాదవ్ తెలిపారు.
హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాగబాబు..రంజిత్ తండ్రి యాకయ్యకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జనసేన కార్యకర్త భద్రత భరోసా కోసం గొప్ప ఆలోచన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసినట్టు తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న ప్రతి జనసైనికుడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.
జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ములుకుంట్ల సాగర్, నియోజకవర్గ నాయకులు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో కొమ్ము రంజిత్ తండ్రి యాకయ్య, సోదరుడు కర్ణాకర్ లను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని రంజిత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అలాగే తమ కుటుంబానికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ 5 లక్షల ప్రమాద బీమా రావడానికి ఈ ప్రక్రియకు సహకరించిన శివకోటికి, సభ్యత్వం చేయించిన వంగ మధు, ఓర్సు రాజేందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాధారపు రాజలింగం, ముమ్మారెడ్డి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.