- సమస్యపై వెంటనే స్పందన
- క్షేత్రస్థాయిలో పర్యటించి ఇష్యూకు పరిష్కారం
- నిరుపేద ఫిజికల్లీ చాలెంజ్డ్ విద్యార్థిని పట్ల ఆఫీసర్ ఔదార్యం
- డీఎండబ్ల్యూవో గౌస్ హైదర్ తీరు పట్ల ప్రశంసల వెల్లువ
వేద న్యూస్, హనుమకొండ:
హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా గౌస్ హైదర్ బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే విధుల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ఏదైనా సమస్య ఉందని ఒక అధికారి దగ్గరికి వెళ్తే.. తన కిందిస్థాయి అధికారులకు ఆ పని అప్పజెప్పి.. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం ఆఫీసులో కూర్చుని సంతకాలకే పరిమితమైన కొంతమంది పెద్ద స్థాయి అధికారులు ఉన్న ఈ రోజుల్లో.. తాను అందుకు భిన్నం అని నిరూపించుకున్నారు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి గౌస్.
దగ్గరుండి అడ్మిషన్ ఇప్పించిన ఆఫీసర్
హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలో ఓ విద్యార్థిని అనారోగ్య సమస్య కారణంగా తన రెండు కాళ్లకు ఇబ్బంది ఉండటంతో పాఠశాలకు కుంటుతూనే వెళ్తోందని, ఆమె ఇబ్బందులను వివరిస్తూ ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారి గౌస్ వెంటనే స్పందించారు. సదరు ఆఫీసర్.. ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక జర్నలిస్టుతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థిని వివరాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా..అదే రోజు క్షేత్రస్థాయి పర్యటనకు రావడం విశేషం.

సదరు విద్యార్థిని సబ్జాన్ ఇంటి వద్దకు మైనారిటీ హాస్టల్‌కు సంబంధించిన టీచర్స్‌ను వెంటబెట్టుకొని.. విద్యార్థిని ఇంటికి స్వయంగా తన కారులో వెళ్లారు. విద్యార్థిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. అక్కడే మైనార్టీ హాస్టల్‌లో సీటు ఇస్తున్నట్లు హామీ ఇచ్చి.. ఆ మరుసటి రోజు మైనార్టీ హాస్టల్‌కు విద్యార్థినిని రమ్మని చెప్పారు. అంతటితోనే తన విధులు అయిపోయాయని ఆఫీసర్ గౌస్ అనుకోలేదు. స్వయంగా ఆయనే దగ్గరుండి మరి సబ్జాన్‌కు అడ్మిషన్ ఇప్పించి.. స్కూల్ యూనిఫాం, బ్యాగ్, బుక్స్, బ్లాంకెట్స్ తన చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.

అనంతరం హాస్టల్‌లో విద్యార్థులందరితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక జిల్లా స్థాయి అధికారి తన దృష్టికి సమస్య వచ్చిన వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారం చూపాడంటే ఆ అధికారికి తన వృత్తి పట్ల, విధుల పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లా స్థాయి అధికారి ఇష్యూపై స్పందించిన తీరు పట్ల ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిరుపేద విద్యార్థిని సబ్జాన్ కుటుంబ సభ్యులు అధికారి గౌస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న వారే సమస్యలు ఎదురైనప్పుడు ఇలా త్వరితగతిన స్పందిస్తారని, సమస్యలకు పరిష్కారం చూపుతారని పలువురు డీఎండబ్ల్యూవో గౌస్ హైదర్‌కు అభినందనలు తెలిపారు.