• సమాజం ఫారెస్ట్ వారియర్స్‌కు అండగా నిలవాలి

అడవి అంటే మానవజాతి ఊపిరి. చెట్లు శ్వాసిస్తేనే మనం శ్వాసించగలం. మేఘాలు వర్షమై కురవడానికి, నదులు ప్రవహించడానికి, నేల సారవంతంగా ఉండడానికి అడవే మూలం. పక్షులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ ఈ ప్రకృతిచక్రంలో భాగం. ఈ సమతుల్యత చెదిరితే మనిషి జీవనం కూడా ప్రమాదంలో పడుతుంది.

అయినా మనం అదే ప్రకృతిని హానికర చర్యలతో ధ్వంసం చేస్తున్నాం. అక్రమంగా భూములు ఆక్రమించడం, చెట్లను నరికి వేయడం, పోడు పేరుతో అడవులను నాశనం చేయడం..  ఇవన్నీ పర్యావరణానికి పగతీర్చుకునే పనులు. కొంతమంది వ్యక్తుల లాభం కోసం జరిగే ఈ అక్రమ పోడ్లు అడవుల గుండెల్లో గాయాలు సృష్టిస్తున్నాయి. వందలాది సంవత్సరాలుగా పెరిగిన అడవులను ఒక్క రోజులో ధ్వంసం చేయడం అంటే భవిష్యత్ తరాల ఊపిరి తీయడమే.

 

 

అడవి దేశ జీవనరేఖ
భారతదే అడవులు ఎవరికీ వ్యక్తిగత ఆస్తి కావు. అవి జాతీయ ఆస్తి.. ఈ దేశపు జీవనరేఖ. ప్రతి భారతీయుడికి అడవి పరిరక్షణ పట్ల బాధ్యత, హక్కు ఉంది. అయితే, కొంతకాలంగా ఎవరికో వాగ్దానం చేసినట్టు అడవులను కొందరు ‘‘నా భూమి, నా హక్కు’’ అంటూ ఆక్రమిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉండకూడదు. అటవీ చట్టాలను కఠినంగా అమలు చేసి, పోడును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.

 

అడవిపైన ఆధారపడే స్థానిక ప్రజలకు పునరావాసం, జీవనోపాధి కల్పించటం ప్రభుత్వం పరిష్కార ప్రధాన దారి కావాలి, అలా చేస్తే అడవి నాశనం కాదు. అటవీ సంరక్షణ పోరాటంలో “ఫారెస్ట్ వారియర్స్” – అంటే అటవీ సిబ్బంది, అటవీ అధికారులు..  అద్భుతమైన ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.

ఎండలో, వానలో, అడవిలో దాడులు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిడుల మధ్య అడవిని కాపాడుతూ త్యాగం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో తమ ప్రాణాలను కోల్పోయిన అటవీ సిబ్బంది మనందరికీ స్ఫూర్తి. వారి సేవకు మన సమాజం జోహార్లు చెప్పాలి.

అయితే, అటవీ సంరక్షణ విషయమై కేవలం అటవీ శాఖపై బాధ్యత వేయడం సరిపోదు. పౌరుడిగా ప్రతి ఒక్కరు అడవిని కాపాడే దిశగా ఆలోచించాలి. శబ్దం లేని పోరాటం కూడా సమాజం నుంచి మొదలవుతుంది.  అక్రమ పోడు ఎక్కడ జరిగినా మనం మౌనం పాటించకూడదు. వృక్షారోపణలో పాల్గొనాలి, అడవి చట్టాల ప్రాముఖ్యతను తెలియజేయాలి, స్థానికులతో కలిసి ప్రకృతిని రక్షించే కార్యక్రమాలను చేపట్టాలి.

 

భవిష్యత్ పెట్టుబడి అటవీ సంరక్షణ
అడవులు లేకుండా మానవజీవనం ఉండదు. నదులు ఎండిపోతే నీరు ఎక్కడి నుండి వస్తుంది? వర్షాలు లేకుంటే పంటల కోసం మేఘాలపై ఎవరుపోయి విత్తనాలు వేస్తారు? ఈ ప్రశ్నలకు ఒక్క సమాధానం – అడవి.అందుకే అడవిని కాపాడటం అనేది పర్యావరణానికి మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు పెట్టుబడి. ఇక ఆలస్యం చేయకూడదు. అక్రమ పోడును అడ్డుకోవాలి.

 

 

ఫారెస్ట్ వారియర్స్ కు గౌరవం ఇవ్వాలి. సమాజం మొత్తం ఒక గళంగా, ఒక బాటగా నిలబడాలి. అడవిని కాపాడటం అంటే జీవాన్ని కాపాడటం. అందరం చేతులు కలిపి ప్రకృతికి అండగా నిలుద్దాం – ఎందుకంటే “ప్రకృతి ఉన్న చోటే భవిష్యత్ ఉంటుంది.”

– రవిబాబు, పిట్టల, పర్యావరణవేత్త, జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ.