వేద న్యూస్, వరంగల్ టౌన్ : 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు నేడు చేపట్టిన “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు మిల్స్ కాలనీ పోలీసులు శివనగర్‌లోని తన నివాసంలో తనను హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత ఖండనీయమని ఆయన మండిపడ్డారు.

పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల పోరాటాలను అణచివేయాలని కాంగ్రెస్ పాలకులు ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ క్షేత్రస్థాయిలో తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని, ఎంతటి నిర్బంధాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే వారిని అడ్డుకోవడం, బీజేపీ నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేదని గంట రవికుమార్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *