– పోచమ్మ మైదాన్‌లో బీజేపీ శ్రేణుల శ్రమదానం
– ‘స్వచ్ఛాంజలి’లో భాగంగా చీపురు పట్టి ఊడ్చిన నాగరాజు

వేద న్యూస్, వరంగల్ పోచమ్మ మైదాన్:
గాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఒక గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛాంజలి’ పేరిట ఇచ్చిన ఆ పిలుపు మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పోచమ్మ మైదాన్ సెంటర్ వద్ద శ్రమదానం చేశాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, వకీల్ సాబ్ అల్లం నాగరాజు మాట్లాడుతూ గాంధీ కలలు కన్న స్వరాజ్యం కోసం నరేంద్ర మోడీ ఆచరణలో కృషి చేస్తున్నారని చెప్పారు. గాంధీ కలలను ఆచరణలో తీసుకొచ్చిన వారు నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు.

ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ పేరిట ఇంటింటికీ డబ్బాలను ఏర్పాటు చేశారని, దేశం మొత్తానికి స్వచ్ఛత కోసం బడ్జెట్ కేటాయించారని చెప్పారు. అయితే, స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేసి అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కట్టి రాష్ట్రసర్కార్ లబ్ధి పొందుతోందని ఆరోపించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడాన్ని స్వాగతిస్తున్నామని కానీ, పేదలకు అండగా ఉన్న ఆస్పత్రిని పట్టించుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

ఈ నెలలో జిల్లా పర్యటనకు వచ్చే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎంజీఎంను విజిట్ చేయాల్సిందే అని కోరారు. మీ కొడుకు హిమాన్షుకు ఉన్న స్ఫూర్తి మీకు ఉండాలని కేటీఆర్ కు హితవు పలికారు. అవసరమైతే తొలుత హిమాన్షును అయినా ఎంజీఎం విజిట్‌కు పంపాలని కోరారు. ‘స్వచ్ఛ భారత్’ పేరు మీద కేంద్రం 70 శాతం నిధులను ఇస్తోందని చెప్పారు. కేఎంసీ ఆస్పత్రి..సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇస్తోందని, అక్కడ ప్రధాని మోడీ పెట్టాలన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ విషయమై పరిశీలించి బోర్డు పెట్టాలని కోరారు. ప్రజల హక్కులను హరించే దిశగా రాజకీయ నాయకులు ఉండకూడదని స్పష్టం చేశారు.


వరంగల్ జిల్లాలోని తెలంగాణ అమరవీరులను కుటుంబ సభ్యులను ఒక చోట చేర్చి.. వారి ‘ఆలంబన’ విషయమై చూడాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. అమరవీరులు లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదని వివరించారు. అమరవీరులతో సమావేశం కావాలని మంత్రి కేటీఆర్ కు సూచించారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికీ మీటింగ్ పెట్టాలన్నారు. న్యాయవాదులతోనూ సమావేశమై మాట్లాడాలని కేటీఆర్ ను కోరారు. న్యాయవాదులు సహోదర్ రెడ్డి, గుడిమళ్ల రవికుమార్, నీల శ్రీధర్, సామంతుల శ్రీనివాస్, తాను అందరం కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఉద్యమం చేసిన సంగతిని అల్లం నాగరాజు గుర్తుచేశారు. న్యాయవాదులు ఆ‘నాడు’ ఉద్యమ సమయంలో జైళ్లకు సైతం వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని వివరించారు. న్యాయవాదులతో మంత్రి కేటీఆర్ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో జిల్లాకు విచ్చేయనున్న మంత్రి కేటీఆర్ తన షెడ్యూల్‌లో ఈ కార్యక్రమాలను పొందుపరుచుకోవాలని ప్రజల పక్షాన కోరుతున్నట్లు బీజేపీ నేత అల్లం నాగరాజు పేర్కొన్నారు.