MLA Raja Singh

వేదన్యూస్ – నాంపల్లి

వరుస వివాదస్పద వ్యాఖ్యలతో ఇటు మీడియాలో నిలుస్తూ అటు పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే రాజాసింగ్ పై వేటు ఖాయమా..?. ఇప్పటికే రాష్ట్ర జాతీయ పార్టీ కమిటీలకు చెందిన నేతల నివేదికలు సిద్ధమయ్యాయా..?. ఇటు రాష్ట్ర నాయకత్వానికి. అటు జాతీయ నాయకత్వానికి ఆ నివేదికలు అందాయా..?. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ నుండి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా..?. అంటే అవుననే అంటున్నారు కమలం నేతలు.

రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని నేతలు ఇచ్చిన నివేదికల ద్వారా నియమిస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ లా పనిచేస్తారు. ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లకే ఊడిగం చేస్తారు. నిఖార్సైన నేతలు.. కార్యకర్తల మధ్య గొడవలు సృష్టిస్తారు. వర్గాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే జాతీయ నాయకత్వమే ఏది మంచిది.. ఏది చెడు అనేది ఆలోచించి రాష్ట్ర అధ్యక్షుడ్ని ఏర్పాటు చేయాలని గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్ర మంత్రి.. ప్రస్తుత రాష్ట్ర కమలం అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించారు. అయితే దీన్ని కూడా రాజాసింగ్ ఎత్తిచూపుతూ ఒకరికి ఊడిగం చేసే ఇలాంటివాళ్లను ఎందుకు ఎంపిక చేస్తారంటూ కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీకి డామేజ్ కలుగుతుందని భావించిన నాయకత్వం ఒకటి రెండు రోజుల్లో రాజాసింగ్ పై వేటు వేయడం ఖాయమంటున్నారు కమలం నేతలు.