= సరైన లీడర్ లేక నైరాశ్యంలో క్యాడర్
= = హస్తం గూటికి 18 మంది కార్పొరేటర్లు..!
= మిగిలింది తాజా మాజీలు నలుగురే..
= అంతర్గత కుమ్ములాటతో నష్టపోతున్న పార్టీ
= బలహీనపడుతున్న గ్రౌండ్ లెవెల్ క్యాడర్
వేద న్యూస్, ఫోకస్ టీమ్ :
వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా, పార్టీకి కంచుకోటగా వెలిగిన తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ గులాబీ దళం తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు నగరంలోనే అత్యంత బలంగా ఉండి, తూర్పు నుండి ఏకంగా సుమారు 22మంది కార్పొరేటర్లతో మున్సిపల్ కార్పొరేషన్‌ను శాసించిన బీఆర్ఎస్.. నేడు కేవలం నలుగురంటే నలుగురు కార్పొరేటర్లకే (తాజా మాజీలు) పరిమితం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక నాయకత్వ లోపాలు, ఏకపక్ష నిర్ణయాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా ఏకంగా 18 మంది కార్పొరేటర్లు గులాబీ కండువా తీసేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం, ముఖ్య అనుచరులు, గ్రౌండ్ లెవెల్ లీడర్లు సైతం హస్తం గూటికి క్యూ కట్టడంతో వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ కోట పూర్తిగా బద్దలైంది.
ఏకపక్ష ధోరణే శాపం.. ఒంటరైన మాజీ ఎమ్మెల్యే!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరి, సొంత నిర్ణయాలే ఈ ఘోర పరాభవానికి ముఖ్య కారణమని క్షేత్రస్థాయి కార్యకర్తలు, పార్టీని వీడిన నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోని సీనియర్లను, కీలక నేతలను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయికి వెళ్లి నిరాశలో ఉన్న కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, వారిని ఓదార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. సరైన దిశానిర్దేశం చేసే సమర్థవంతమైన స్థానిక నాయకత్వం కరువవడంతో, దిక్కుతోచని స్థితిలో ద్వితీయ శ్రేణి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క చూపులు చూడాల్సి వచ్చింది.
నలుగురికే పరిమితమైన గులాబీ దళం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తూర్పు నియోజకవర్గం ఎప్పుడూ బీఆర్ఎస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేది. కానీ కాలం మారడంతో వలసలు కూడా పెరిగిపోయాయి.. ఒక్కొక్కరుగా 18 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ బలం నామమాత్రంగా మారింది. కేవలం కార్పొరేటర్లే కాదు, డివిజన్ల పరిధిలో ఉన్న ముఖ్య కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కూడా పార్టీని వీడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్‌ను కాపాడుకోవడంలో స్థానిక లీడర్లు విఫలమవడంతో.. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి వస్తున్న విపరీతమైన రాజకీయ, సామాజిక ఒత్తిళ్లను తట్టుకుని క్షేత్రస్థాయిలో గులాబీ జెండాను మోయడం మిగిలిన నలుగురు తాజా మాజీ కార్పొరేటర్లకు, కొద్దిపాటి క్యాడర్‌కు అగ్నిపరీక్షగా మారింది.
అధిష్ఠానం జోష్ నింపుతున్నా..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కోల్పోయిన వైభవాన్ని మళ్లీ తిరిగి తెచ్చుకోవడానికి బీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వరుసగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, క్యాడర్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ అగ్రనాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది. అయితే, అగ్రనేతలు వచ్చి ఎంత జోష్ నింపాలని చూస్తున్నప్పటికీ, స్థానికంగా అందరినీ సమన్వయం చేసే బలమైన లీడర్ లేకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. వరంగల్ తూర్పులో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే గ్రౌండ్ లెవెల్‌లో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చి, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు విశ్లేషకులు.
