- నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి:కలెక్టర్ రాహుల్ రాజ్
వేద న్యూస్, టేక్మాల్:
మెదక్ జిల్లా రేగోడు, శంకరంపేట ఆర్ , అల్లాదుర్గ్, టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
గ్రామ పంచాయతి ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ మెదక్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్ లు జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6మండలాలైన , అల్లాదుర్గ్, రేగోడు, టేక్మాల్ హవేలీ గన్పూర్, పాపన్నపేట , శంకరంపేట ఆర్, 160 సర్పంచ్, 1402వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపధ్యంలో రేగోడు, శంకరంపేట ఆర్, అల్లాదుర్గ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు.
నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు.
ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.