- ‘చందన’@చర్చావేదిక డిస్కషన్ అడ్డా ఇది..
- హోటల్ చరిత్ర సుమారు 30 ఏండ్లకుపైనే..
వేద న్యూస్, జమ్మికుంట:
వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతున్న జమ్మికుంట, సమీప పరిసర ప్రాంత, మండల పరిధిలోని ప్రజలు, పట్టణవాసుల డిస్కషన్ అడ్డాగా ‘చందన’ కొనసాగుతోంది. ఈ హోటల్‌కుసుమారు 30 ఏండ్లకుపైనే చరిత్ర కలిగి ఉండి.. చక్కగా కొనసాగుతోండటం విశేషమని చెప్పొచ్చు. జమ్మికుంట నడిబొడ్డున బ్రిడ్జి కింద అన్నపూర్ణ థియేటర్ వెళ్లే లైన్లో ఉన్న ఈ హోటల్‌కు మూడు దశాబ్దాలకుపైన హిస్టరీ కలిగి ఉన్నది.
అందరూ అక్కడే..!
ప్రతీ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు జమ్మికుంట సమీప పరిసర ప్రాంత ప్రజలు నాయకులు, పుర ప్రముఖులు కొందరు, చిరు వ్యాపారులు, విలేకరులు.. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏదో ఒక సమయంలో చందన హోటల్ వద్దకు వచ్చి చాయ్ తాగి.. చర్చలు కొనసాగిస్తుంటారు. ఇక్కటికి రాకపోతే తమకు పొద్దుపోదు అని భావించేవారూ ఉన్నారని చెప్పడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుత స్థానిక పంచాయతీ ఎన్నికల రాజకీయ నేపథ్యంలో నాయకులు, పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు, మద్దతుదారులు, జర్నలిస్టులు, కార్యకర్తలు నిత్యం ఉండే ప్రాంతంగా ఇది మారనుంది. ప్రతీ రోజూ ఇక్కడికి వచ్చి చాయ్ తాగి నలుగురితో ముచ్చటిస్తూ.. రాజకీయాలను విశ్లేషిస్తుండటం తమకు పరిపాటి అయిందని ఓ నేత అభిప్రాయపడ్డారు.
ఇక జర్నలిస్టులకు అయితే అందరూ కలిసి పిచ్చాపాటిగా ముచ్చటిస్తూ.. వార్తల సేకరణతో పాటు రాజకీయ నాయకులతో ముచ్చట్లు, ఇతర డిస్కషన్స్ అన్నింటికీ ఇది ఓ ఫేవరెట్ డిస్కషన్ స్పాట్‌గా ఉంటుందని, చక్కగా చాయ్ తాగుతూ.. హోటల్లో టిఫిన్ చేస్తూ..పనులు పూర్తి చేసుకోవచ్చని పలువురు చెబుతున్నారు. నాయకులతో పాటు రాజకీయాలకు సంబంధించిన అన్ని రకాల చర్చలను ఇక్కడ చందన హోటల్ వద్ద చాయ్ తాగుతూ.. తాము చాలా కాలంగా చేస్తున్నట్టు కొందరు నేతలు పేర్కొన్నారు.

