- చెరువులను పరిరక్షించాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు
వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి:
పార్వతీపురం పుర పాలనను చక్కదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు, జిల్లా నాయకులు కోల కిరణ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన పార్వతీపురం మున్సిపాలిటీకి ఆ స్థాయి మున్సిపల్ కమిషనర్ నియమించాలని కోరారు.
చుట్టరికం, బంధుత్వం, ఏవేవో బలహీనతలకు లొంగి అర్హత లేని వారిని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తే అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపించారు. కాబట్టి ప్రభుత్వం అర్హత కలిగినటువంటి వ్యక్తినే మున్సిపల్ కమిషనర్ గా నియమించాలని కోరారు. 10, 15 రోజులకు ఒకసారి ఇచ్చే మున్సిపల్ కుళాయిల తాగునీరు ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ మార్పు చేసేందుకు చర్య చేపట్టాలన్నారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించి ప్రజాహితంగా పాలించేందుకు వైసిపి, కూటమి నాయకులు తమ పట్టు విడుపు వీడాలని కోరారు.
పురపాలనపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి పనికి ఒక రేటు అంటూ… పాలను సాగుతున్న మున్సిపల్ కార్యాలయాన్ని లంచాలు లేని కార్యాలయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో వీధులతో పాటు మురుగు కాలువల్లో మురుగు పేరుకు పోయిందని చెప్పారు. దీనివల్ల దుర్గంధం తో పాటు దోమలు అధికంగా ప్రబలి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని వివరించారు.
తక్షణమే మురుగు తీత పనులు చేపట్టాలని, ఏ మాత్రం వర్షం పడిన పట్టణ మెయిన్ రోడ్డు చెరువు అవుతోందని, నీరు ప్రవహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. మున్సిపాలిటీలో కబ్జా గురైన చెరువులన్నింటిని రక్షించాలని తెలిపారు. చేపల మార్కెట్ కు వసతులు కల్పించాలని విన్నవించారు. రోడ్లు గోతులు, వీధిలైట్లు పై దృష్టి సారించాలని సూచించారు. సంబంధిత పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి గాడి తప్పిన పార్వతీపురం మున్సిపాలిటీ పరిపాలన గాడిలో పెట్టాలని కోరారు.