వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి:

బీసీల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల సీసీ కార్నర్ లోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ప్రధాని మోడీకి పోస్ట్ కార్డులు పంపించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు పంపించడం జరిగిందని తెలిపారు.

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతపై బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. బీసీల్లో రోస్టర్ విధానం అమలు చేసి ఎస్సీ, ఎస్టీ లాగే బ్యాక్ లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింప చేయాలని, రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతులో రిజర్వేషన్ కల్పించాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు జరిపించాలని, జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని, న్యాయ వ్యవస్థలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు బోడంకి మహేష్, నాయకులు రాసమల్ల కుమార్, చంద్రగిరి చంద్రమౌళి, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.