వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో భాగంగా గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా ఆమె ఆస్పత్రుల నిర్వాహకులకు, డాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిసెప్షన్ కౌంటర్ యందు చికిత్సలకు సంబంధించిన ధరల పట్టిక వివరాలు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, వైద్యులు మరియు సిబ్బంది వివరాలు తప్పనిసరిగా కనిపించేలా ప్రదర్శించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.అంతేకాకుండా, హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటించాలని, వ్యాధిగ్రస్తులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హత కలిగిన వైద్యులు మరియు సిబ్బందిని మాత్రమే నియమించాలని, డయాగ్నస్టిక్ కేంద్రాలు మరియు ల్యాబ్‌లను రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు.హాస్పిటల్ రికార్డులు మరియు సరైన మెడికల్ రిపోర్టులు క్రమంగా ఉంచాలని ఆమె హెచ్చరించారు.నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న హాస్పటళ్లను రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని లేదా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రజిత తెలియజేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.