- బీరన్న బోనాలలో గావు పట్టే ఘట్టం ప్రత్యేకత
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన పండుగలలో బోనాలు ఒకటి. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారు. శివ కేశవులు విష్ణుకు ప్రీతికరమైన రోజు ఉపవాసాల వ్రతాలు ప్రారంభమయ్యే శుభదినం పండుగలకు స్వాగతం పలికే రోజు ‘తొలి ఏకాదశి’. ఆషాడ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.

తొలి ఏకాదశి సందర్బంగా వరంగల్ కరీమాబాద్ లో కురుమ కులస్తులు బీరప్ప కామరతి, అక్క మహంకాళి దేవతమూర్తులకు బోనాలు సమర్పించనున్నారు. రామస్వామి గుడి నుంచి బురుజు సెంటర్ మీదుగా ఒగ్గుడోలు కళాకారుల వాయిద్యాలు..శివాసత్తుల నృత్యాలు..బీరన్నల విన్యాసాలు మధ్య వందలాది మంది మహిళలు బోనలతో పాటు పట్టువస్త్రాలతో బీరప్ప ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చి ఒడిబియ్యం పోస్తారు.
బీరన్న బోనాల చరిత్ర
వరంగల్ కరీమాబాదులో ఆషాడ మాసం ‘తొలి ఏకాదశి’ సందర్భంగా నిర్వహించే బోనాలకు శతాబ్దాల చరిత్ర కలిగిన బీరన్న బోనాలు. శతాబ్ద క్రితం ప్లేగ్ వ్యాధి పుట్టి ప్రజలు చనిపోతుండగా వారు బీరన్న స్వామిని ప్రార్థించి ఇలా మొక్కారు. ఈ వ్యాధిని నివారిస్తే నీకు బోనం సమర్పిస్తాము. ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి తగ్గిపోయిందన్న విశ్వాసంతో బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అప్పటినుండి ఏటేటా వైభవంగా కొనసాగుతోంది.

వర్షాలు పడక పొలాల పొడబారిపోయాయి రైతులు నిస్సాయంగా మారారు అలాగే ప్లేగ్ వ్యాధి వ్యాపించి ప్రజలు చనిపోతుండగా..ఆ సమయంలో ప్రజలందరూ కలసికట్టుగా బీరప్పకి పూజించి..ప్రజల ఆరోగ్యంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని బీరప్ప కి వేడుకున్నారు. కురుమకుల ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామికి పూర్వం తొలి ఏకాదశి రోజున రజాకారుల పాలనలో వారి అరాచకాలను ఎదుర్కొని కురుమ కులస్తులందరూ ఐక్యత చాటుతూ జాతీయ జెండాను దేవాలయం పై ప్రతిష్టించి స్వామివారికి బోనం సమర్పిస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా బీరన్నలు
1957 సంవత్సరం నుండి సైదాపూర్ మండల కరీంనగర్ జిల్లా కి చెందిన బీరన్నలు వస్తున్నారు. బీరన్నలు పసుపు, కుంకుమ రాసుకుని, చిప్పలు మోగిస్తూ తాళాలు వేసుకుంటూ, కత్తుల తో విన్యాసాలు చేస్తూ ఊరేగింపులో ముందుంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తొలి ఏకాదశి ముందు రోజున బీరన్నలు కురుమ కులస్తుల ఇంటిపై బలి బలి అంటూ సరుగు చల్లుతారు.
బోనం ప్రత్యేకత
బోనం అనేది ఒక మట్టి గిన్నె(పాత్ర)- అందులో అన్నం, పెరుగు, బెల్లం పెట్టి పూలతో అలంకరించి, తల మీద మోసి బీరన్నకి సమర్పిస్తారు.

బోనాల్లో ముఖ్యమైన ఘట్టం గావు
కురుమ కుల పెద్దలు దయ్యాల వారు మరియు మండల వారు గంప లో బిరన్న స్వామి కళ్యాణానికి మరియు పట్నానికి కావాల్సిన బండారి, పచ్చ, కుంకుమ, తెల్ల పిండి, పల్లక, నిమ్మకాయలు, కళ్యాణం కోసం అబ్బాయి కి దయ్యాల వంశస్థులు, అమ్మాయికి మండల వంశస్థులు తరుపున ఆలయానికి తీసుకెళ్తారు.

రామస్వామి గుడి నుండి మహిళలు అందరూ బోనమెత్తి ఊరేగింపుగా బురుజు సెంటర్ కి చేరుకుంటారు. ప్రత్యేక వేషధారణలో ఉన్న బీరన్నలు గావు పడుతారు. గొర్రె పిల్ల తలను కోరికి రక్తం చిందిస్తుండగా..భక్తులు గొర్రె పొట్టేలు రక్తాన్ని వీర తీలకంగా పెట్టుకోవడానికి యువకులు ఉత్సాహం కనుబరుస్తారు.
బోనాలతో ఉన్న మహిళలందరూ గావు పట్టిన గొర్రె పిల్లను దాటుతూ ఆలయానికి చేరుకుంటారు. మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని బీరన్నకు మహిళలు కొత్త బట్టలు పెట్టి కొత్త కుండలో తెచ్చిన బోనాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.



